సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం
– అడ్డుకున్న పోలీసులు… జర్నలిస్టుల అరెస్ట్
గన్‌పార్క్, జూన్ 18, ( అద్దం న్యూస్ ) : రాష్ట్ర ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ డిమాండ్ల సాధనకై గురువారం జర్నలిస్టులు ” ఛలో హైదరాబాద్ ” కార్యక్రమం నిర్వహించారు. గన్ పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన ” ఛలో హైదరాబాద్ ” పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టుల గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలు పెట్టి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పన్నెండేళ్ళుగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన జర్నలిస్టులను పాలకులు చిన్నచూపు చూడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్స్ వెంటనే ఇవ్వాలని, ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలని, గ్రేటర్ హైదరాబాద్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్నై, పీఆర్జీఐ రిజిస్ట్రేషన్ తో రెగ్యులారిటీ ఉన్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఉచిత విద్యను అందించాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్టుకు ఉచిత బీమా పథకం ఏర్పాటు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు పెన్షన్లు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాలని, జర్నలిస్టుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ, జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి చేయి చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణలో అనేక చిన్న, మధ్య తరహా పత్రికలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని, రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్ బిల్స్ ఇవ్వడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది జర్నలిస్టులు పాల్గొని ప్లకార్డులతో నినదించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు విజయ్ కుమార్, యాదగిరి, శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్, జగదీశ్వర్, పాండు రంగారావు, పద్మనాభరావు, సామ్రాట్ గుప్తా, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రవి కుమార్, కో-కన్వీనర్లు ఆర్. శ్రీనివాస్ గౌడ్, సంతోష్ కుమార్, ఎం.రవికుమార్, సుభాష్, వెంకన్న, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, నగేష్, మహబూబ్‌నగర్ జిల్లా కార్యాధ్యక్షుడు నర్సింహా, కార్యదర్శి గోపాల్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మధు, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జానయ్య, హరిప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, స్వామిదాస్, సురేందర్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బాస్కర్, రంగారెడ్డి జిల్లా నాయకులు అశోక్ కుమార్ గౌడ్, పర్వతాలు, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply