ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంది – త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం – తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంది
త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం
• తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత

తెలంగాణ బ్యూరో, ఫిబ్ర‌వ‌రి 12, అద్దం న్యూస్ :       ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందని, త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని, మీరు బయట ఉండి బాధపడితే నేను బీఆర్ఎస్‌లో ఉండి బాధపడ్డానని క‌విత అన్నారు. కేసీఆర్‌ను విమర్శించాలని లేదు… కానీ పదేళ్లు అవకాశం వస్తే ఏం చేశారు ? అని క‌విత ప్ర‌శ్నించారు. ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యం అని ధ్వ‌జ‌మెత్తారు. కోదండరాం, ఆకునూరి మురళి లు రేవంత్ రెడ్డితో కలవటంతోనే ప్ర‌జ‌లంద‌రూ కాంగ్రెస్‌ను నమ్మారన్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి ఆర్టీసీ క‌ళ్యాణ మండ‌పంలో గురువారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ… తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చేదు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయని, మనవాళ్లే గాయం చేయటంతో నొప్పి ఎక్కువగా ఉందన్నారు. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని అన్నారు. మంచితనం, సహనశీలత, భోళాతనం తెలంగాణ తత్వం.. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే అని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డిని బిల్డింగ్ బయటికి గుంజుతర‌న్నారు. మనవాళ్లు కాదు. ధర్మం వైపు ఉండాలని శ్రీ కృష్ణుడు చెప్పారన్నారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉందని… వారి కోసం పోరాటం చేస్తామ‌ని పేర్కొన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12 న మనమంతా ఇలా చారిత్రక ప్రాంతమైన ఆర్టీసీ కళ్యాణ మండపంలో కలుసుకోవటం కొంత సిగ్గుగా, కొంత సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు ఒక్కటైతే ఇదే చోట మనంతా తెలంగాణ జేఏసీగా ఏర్పాటయ్యామ‌ని… ఆ తర్వాత మనం తెలంగాణను సాధించుకున్నామ‌న్నారు. కానీ మళ్లీ ఒకసారి ఉద్యమకారుల కోసం ఒక అడుగు ముందుకు వేసేందుకు ఇక్కడ కలుసుకున్నామ‌న్నారు. నిజానికి రాష్ట్రం రాగానే ఉద్యమకారులందరికీ మొదటి వరుసలోనే గౌరవం, ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించామ‌ని…కానీ ఆ విధంగా జరగకపోవటం చాలా బాధ కలిగించే అంశం అని క‌విత అన్నారు.

మన తెలంగాణ అనేది నిత్యం పోరాటాల గడ్డనే అని… మానవాళి పుట్టినప్పటికీ నుంచి మన గడ్డకు ఎంతో చరిత్ర ఉంద‌న్నారు. తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నాన‌ని… ఎన్ని జన్మలు ఉన్న సరే మళ్లీ తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నాన‌న్నారు. మన నేలకు పునీతమైన, పురాతనమైన చరిత్ర ఉందన్నారు. 1860 లోనే రామ్ జీ అనే గోండు బిడ్డను ఆయన అనుచరులను వెయ్యి మందిని ఒకే చెట్టుకు బ్రిటీష్ వాళ్లు ఉరి తీశారన్నారు. ఆ తర్వాత మరో గోండు బిడ్డ కొమురం భీమ్ కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు.

1942 జులై 4 వ తేదీన దొడ్డి కొమురయ్య అమరుడైతే తెలంగాణ మొత్తం అగ్గి అయ్యిందని… అప్పటి దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఒక్కటైందన్నారు. 1942 కు ముందే మన ప్రాంతంలో భూ పోరాటాలు జరిగి భూ పంపిణీ జరిగిందని, స్వాతంత్య్రం రాకముందు వరకు కూడా రజాకార్లు, సైన్యం చేసిన ఘోరాతి దురాగతలను భరించామ‌న్నారు. 1956 లో ఆంధ్రాతో మనల్ని కలిపారు… కానీ కొన్ని సంవత్సరాలకే వాళ్లపై పోరాటం చేశార‌ని గుర్తు చేశారు. 1962 లో ఇడ్లి, సాంబార్ గో బ్యాక్ ఉద్యమం చేశామ‌ని… 1969 లో తెలంగాణ ఉద్యమం చేశార‌ని తెలిపారు. 1969 లో తెలంగాణ ఉద్యమం చేసిన మన 369 మంది పిల్లలను కాసు బ్రహ్మనంద రెడ్డి పొట్టన పెట్టుకున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. కానీ ఇప్పటికీ కూడా హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్‌కు అదే పేరు ఉందని విమ‌ర్శించారు. ఏ చేదు గుర్తులు ఉండకూడదని అనుకున్నామో ఆ గుర్తులు ఇంకా ఉండటమే మనకు బాధ అని అన్నారు. నక్సల్ ఉద్యమం చేసిన మన వాళ్లను రాజ్యం ఘోరాతి ఘోరంగా పొట్టన పెట్టుకుందన్నారు. 1995లో వరంగల్ డిక్లరేషన్‌తో మా తెలంగాణ మాకు కావాలని నినదించారన్నారు. గద్దర్ సహా చాలా మంది మేధావులు అప్పుడు తెలంగాణ కోసం పోరాడార‌ని… అప్పటి వరకు కూడా మన విప్లవకారులు, మేధావులు, తెలంగాణ భావాజాలాన్ని కాపాడారన్నారు. ఇక 2001లో కేసీఆర్ వచ్చి తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేశారన్నారు.

స్వరాష్ట్రంలో కొంత మంది ఉద్యమకారులకే అవకాశాలు వచ్చాయని…అవకాశాలు వచ్చిన వాళ్లు ఉద్యమకారుల భుజాలు తడుతారని భావించామ‌న్నారు. కానీ అవకాశం వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి వచ్చిందని…మనవాడే మనల్ని పురుగుల్ని చూసినట్లు చూసి అవమానించాడన్నారు. ఇక ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారో, మనల్ని ఉద్యమంలో కొట్టించారో వాళ్లే కేసీఆర్ చుట్టూ చేరారని తెలిపారు. కేసీఆర్‌ను అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. కేశవరావ్ జాదవ్ చనిపోతే ఎందుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహాం పెట్టాలని అప్పటి మున్సిపల్ మినిస్టర్ ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశానని క‌విత తెలిపారు. ట్యాంక్ బండ్ పై కూడా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయామ‌న్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ కూడళ్లలో ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నారు… గద్దర్, బిరుదురాజు రామరాజు, సుద్దాల హన్మంతు లాంటి వాళ్ల విగ్రహాలు రవీంద్ర భారతిలో ఉండాలన్నారు. కానీ ఎవరి విగ్రహాలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా అని అన్నారు. ఉద్యమకారులపై లాఠీ దెబ్బ పడాలంటే ముందు ఆ లాఠీ నా మీద పడాల్సిందే అని అన్నారు. ఉద్యమకారులకు బుల్లెట్ తగలలంటే ముందు నన్ను దాటి వెళ్లాల్సిందే అని క‌విత అన్నారు. జీ హుజుర్ అంటే అక్కడే ఉండేదాన్ని, క్యా హుజుర్ అన్నందుకు ఇక్కడ ఉన్నా అని అన్నారు. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని.. ఇప్పుడు కూడా వారికి న్యాయం జరగటం లేదన్నారు. ఈ ముఖ్యమంత్రి బతుకమ్మను తీసేసి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాడని విమ‌ర్శించారు. ఉద్యమకారులను గుర్తించేందుకు మనం యాప్ సిద్ధం చేశామ‌ని… యాప్ లో ఎన్ రోల్ చేసుకొని మన ఐడెంటిటీని మనమే గుర్తించుకుందామ‌న్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం గుర్తించకపోతే కోదండ రాం, ఆకునూరి మురళి ల‌ను పట్టుకుందామ‌న్నారు. యాప్ లో ఎన్‌రోల్ చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తామ‌న్నారు. తెలంగాణలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు లాభం జరగలేదు… కానీ మేఘా కృష్ణారెడ్డి అపర కుబేరుడయ్యాడన్నారు. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేశారని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు. తెలంగాణ వచ్చాక కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారని.. ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు ? క‌విత ప్ర‌శ్నించారు. ఈ ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందని ఆమె స్ప‌ష్టం చేశారు. ధర్మం వైపే ఉండాలని శ్రీ కృష్ణుడు ఎప్పుడో చెప్పారని… తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉందన్నారు. తెలంగాణ జాగృతి వారి కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని క‌విత తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉద్యమకారులు కాచం సత్యనారాయణ, బత్తుల సోమయ్య, జానకి రెడ్డి, కుమార స్వామి, సుధం లక్ష్మి, బోగె పద్మ, సాజిద సికిందర్, నవీన్ ఆచారి, చైతన్య, సిద్ధారెడ్డి, చిలుక ప్రవీణ్, గీతా గుప్తా, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page