తార్నాక, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ మొలుగరం సూచించారు. ఓయూ సైకాలజీ, ఎడ్యుకేషన్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో, కెరీర్ కన్సల్ట్జ్ సహకారంతో ప్రొఫెసర్ జి.రామ్రెడ్డి దూరవిద్య కేంద్రంలోని సెంటినరీ హాల్లో జపాన్లో ఉపాధి అవకాశాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు అంతర్జాతీయ అవకాశాలను చేరువ చేసేందుకు విశ్వవిద్యాలయం కృషి చేస్తోందన్నారు. ఓయూ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ విద్యా సంబంధాలు, సహకారంతో ఉన్నత విద్య, ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
అనంతరం జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని అక్కడి విద్య, ఉద్యోగ రంగాల్లోని అవకాశాలను వివరించారు. ప్లస్ పివోట్ కో-లిమిటెడ్ సీఈవో నియోకి యమమోటో, హనా గ్లోబల్ ఎడ్యుటెక్ డైరెక్టర్ మివూ హాన్, సాహిబోబెరుటే కో-లిమిటెడ్ సీఈవో యోషిరో కుబోటా, ఎంజాయ్ కో-లిమిటెడ్ సీఈవో తకమాస ఇవాటా, డోన్ ప్రతినిధి హయాటో ఇటో పాల్గొన్నారు. జపాన్లో నియామక ప్రక్రియలు, ఉద్యోగ అవకాశాలు, భాషా నైపుణ్యాల ప్రాధాన్యతపై వారు తమ అనుభవాలను పంచుకున్నారు. భారతీయ విద్యార్థులు జపాన్లో చదువుకోవడం, ఉద్యోగాలు పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.నరేష్రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఓఎస్డి, సీనియర్ ప్రొఫెసర్ ఎస్.జితేందర్కుమార్ నాయక్, కెరీర్ కన్సల్ట్జ్ బిజినెస్ డైరెక్టర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
