జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో
ప్రభుత్వ వివక్షపై పోరుకు సిద్ధం కావాలి
– టీడబ్ల్యూజేఎఫ్, జీహెచ్‌జే సొసైటీల పిలుపు
హైదరాబాద్ బ్యూరో, మే 6, ( అద్దం న్యూస్ ) : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ( జీహెచ్‌జేహెచ్ఎస్ ) అధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, సొసైటీ కార్యదర్శి బి.శ్రీనివాస్ లు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన సొసైటీల సమావేశానికి తమ సొసైటీని ఆహ్వానించకపోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2008 లో ఏర్పడిన తమ సొసైటీని విస్మరించడం బాధాకరమని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్న 1350 మంది జర్నలిస్టులు తమ సొసైటీ లో సభ్యులుగా ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం దారణమని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశానికి కేవలం నాలుగు జర్నలిస్టు సొసైటీలను మాత్రమే పిలిచి, తమ సొసైటీని పక్కన పెట్టారని, దీని వెనక కొందరి కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. గతంలో కూడా పలు మార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జరిగిన సొసైటీల సమావేశాలకు కూడా తమ సొసైటీని ఆహ్వానించలేదని వారు ధ్వజమెత్తారు. తమకు రావాల్సిన హక్కులను కాలరాసేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ వివక్ష చూపుతున్నారని వారు మండిపడ్డారు. తమ సొసైటీలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరైంది కాదని అన్నారు.
ప్రభుత్వ వైఖరిపై యుద్ధం :
సచివాలయంలో జరిగిన సమావేశం ఫలితాలను నిశితంగా గమనిస్తున్నామని, అక్కడ తీసుకునే నిర్ణయాల ఆధారంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వారు స్పష్టం చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనీ, అయితే కొందరు జర్నలిస్టు నాయకులు తమ సొసైటీ పట్ల మంత్రికి, అధికారులకు తప్పుడు సమాచారమిచ్చి దూరం పెడుతున్నారని ఆరోపించారు. తమ సొసైటీ పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష, నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే…సొసైటీ సభ్యులంతా యుద్ధానికి సిద్ధం కావాలని వారు సభ్యులకు పిలుపునిచ్చారు. కేవలం నాలుగు సొసైటీలకే మంత్రి సమావేశంలో ప్రాధాన్యం ఇవ్వడమనేది పక్షపాతమని, తమను దూరం పెట్టడం వెనుక ఉన్న శక్తుల కుట్రను ఎండగడతామని వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో పక్షపాత ధోరణి సరైంది కాదని, తమ సొసైటీ సభ్యుల ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.












Leave a Reply