
హైదరాబాద్, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన పేరుతో కొండంత ప్రచారం చేసి అతికష్ట మీదట కులగణన పూర్తిచేసి సంపూర్ణంగా బలహీన వర్గాల సంఖ్య తేలకుండానే తమకు తోచింది చేస్తూ, 42 శాతం బీసీలు రిజర్వేషన్లు కల్పిస్తామని అదరబాదరా బిల్లు పెట్టి రాబోతున్న ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తుందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బీసీలకు తాము కట్టుబడి ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి బిల్లు పంపించడం పట్ల స్వాగతిస్తూన్నామన్నారు. 1982 మార్చి 29 వ తేదీన స్థాపించిన నాటి నుండి ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన, వెనుకబడిన వర్గాలను చైతన్యపరిచి రాజ్యాధికారం కలిపించే దిశగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూనే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడే నాటికి అంతకు ముందు కేవలం కొన్ని అగ్రవర్గాల చేతిలోనే రాజ్యాధికారం ఉండేదని గుర్తు చేశారు.
అగ్రవర్గాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని బడుగు బలహీన వర్గాల ఇంటి ముందుకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేసారు. స్థానిక సంస్థల్లో కాకుండా అన్ని ఎన్నికల్లో జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు సీట్లు కేటాయించాలని అన్నారు. “బలహీన వర్గాల అండ తెలుగుదేశం జెండా” అనే నినాదం తెలుగుదేశం పార్టీ ప్రధమ లక్ష్యమన్నారు. కులగణనా జరిగిన వెంటనే అఖిలపక్షాలను సంప్రదించి బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశగా అఖిల పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాల్సింది, ఆదరా బాదరగా అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంటుకు పంపిన తర్వాత అఖిలపక్షం అందరినీ ఢిల్లీకి తీసుకొని వెళ్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్నటి వరకు ఒంటెద్దు పోకడలు పోయి, కేంద్రం ముందుకు వచ్చేసరికి అన్ని పార్టీలు అఖిలపక్షం కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. బిసిల పట్ల కేవలం రాజకీయ డ్రామాలు కాకుండా కపట నాటకాలు చేయకుండా చిత్తశుద్దితో ఉండాలన్నారు. ఏ పార్టీ అయినా బలహీన వర్గాల పట్ల ముసలి కన్నీరు, కపట ప్రేమ చూపిస్తే తెలుగుదేశం పార్టీ సహించదని అన్నారు. తెలుగుదేశం ప్రధాన లక్ష్యం బలహీన వర్గాల సంక్షేమమే అని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానితో చర్చించి బీసీలకు అండగా ఉండి బిల్లు అయ్యే విధంగా ప్రయత్నిస్తారని సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, కట్టరాములు, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply