సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కాంగ్రెస్ కుట్రలు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కాంగ్రెస్ కుట్రలు
» మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, జ‌న‌వ‌రి 8, అద్దం న్యూస్ :   ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం పద్మారావు నగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన, సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11వ తేదీన బాలంరాయ్‌లోని లీ ప్యాలెస్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వాణిజ్య–వ్యాపార కార్మిక సంఘాలు, కాలనీలు, బస్తీల కమిటీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. అదే సమావేశంలో జనవరి 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీ, అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి ఉన్నాయని పేర్కొన్నారు.1806లో సికింద్రాబాద్ ఏర్పాటయ్యిందని గుర్తు చేశారు. సికింద్రాబాద్ పేరు, చరిత్రను తుడిచివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. 1897లో నిజాం కాలంలో నిర్మించిన 120 అడుగుల ఎత్తయిన క్లాక్ టవర్ సికింద్రాబాద్ చరిత్రకు సజీవ సాక్ష్యమని అన్నారు.

        ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లతో మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టిందని, అయితే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదని, సికింద్రాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఉద్యమమని స్పష్టం చేశారు. తమ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇది రాచరిక పాలన కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ప్రాంత చరిత్రను విస్మరించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అంబులెన్స్ సురేష్, ఏసూరి మహేష్, బాబురావు, మహేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page