బూటకపు వాగ్దానాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబ

హైదరాబాద్, అద్దం న్యూస్ : “గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తా” అన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉంద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబ అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పైగా గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 1వ తారీకు జీతాలు అందించలేక అప్పుల కోసం వెంపర్లాడుతున్న ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించి యువతను ఆదుకుంటామని చెప్పడం రాజకీయంగా బూటకపు వాగ్దానమని సాయిబాబా అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని టిడిపి జిల్లా కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ…ఈనాటికీ “మహాలక్ష్మి పథకం” మహిళలకి “ఫ్రీ బస్సు” అని మొదలుపెట్టి, కేవలం 2 నెలల కాలంలోనే బస్సుల సంఖ్య పూర్తిగా కుదించి రెండు గంటలకు.. మూడు గంటల వ్యవధిలో ఒక బస్సు చొప్పున తిప్పుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమ‌ర్శించారు. అమలుకు నోచుకోని హామీలతో “కళ్యాణమస్తు” పథకం కింద ఆడబిడ్డలను తులం బంగారం ఇస్తామని చేసిన వాగ్దానం మోసపూరిత ఎన్నికల హామీ అని తెలుస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. రైతు రుణమాఫీ అంటూ రాష్ట్రంలో సగం మందికి కూడా అందరిని 2 లక్షల రుణమాఫీ అడ్డగోలు వ్యవహారంగా మారిందన్నారు. ఇప్పటి వరకు ఏ పథకం కూడా మాకు అందలేదని ప్రజలు గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిప‌డ్డారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి “పాడిందే పాటరా! పాసు పండ్ల దాసరి” అన్నట్టు రేపు, మాపు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. యువ వికాసం పెద్ద మోసం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుచ్చు టోపీ పెడుతుంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కులగణన సర్వే ఆశించిన రీతిలో నిర్వహించలేదని ప్రజలు పత్రికలలో దుమ్మెత్తి పోస్తుంటే, ప్రభుత్వం చలించకుండా మొండి వైఖరితో ప్రవర్తించడం దుర్మార్గమైన చర్య అని విమ‌ర్శించారు. అమలు కానీ హామీలతో, దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ మనగడ కోసం ఇతర పార్టీల శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని దుయ్య‌బ‌ట్టారు. అందులో కొందరు మేము అధికార పార్టీలో చేరలేదని, మొత్తుకుంటున్నా వారికి థాయిలాలు చూపించి తమ వైపు తిప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రజల గోడు పట్టించుకుని, పూర్తి చిత్తశుధ్ధితో పరిపాలన చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, కిరణ్ కుమార్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page