హైదరాబాద్‌పై కాంగ్రెస్–ఎంఐఎం కుట్ర ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్‌పై కాంగ్రెస్–ఎంఐఎం కుట్ర !
– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి ) పరిధిలో 300 డివిజన్ల ఏర్పాటుకు సిద్ధపడటంపై తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం కేవలం కాంగ్రెస్– ఎంఐఎం ల రాజకీయ కుట్రలో భాగమేనని, ఇది ప్రజాస్వామ్యానికి, హైదరాబాద్ మత సామరస్య స్వరూపానికి గొడ్డలిపెట్టు అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా తీవ్రంగా విమర్శించారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… 300 డివిజన్ల ఏర్పాటు వెనుక ఎంఐఎంకు అధికారం కట్టబెట్టే ప్రయత్నం అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులను, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండా, సడీ చప్పుడు లేకుండా ఏక పక్షంగా 300 డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమ‌న్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలతో చర్చించకుండా నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. ఆగమేఘాల మీద విలీనాలు చేసి, ప్రజలకు ఏం చేయగలరో వివరించకుండా, దేశంలో పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారిందని చెప్పుకోవడానికి తాపత్రయ పడుతోందన్నారు.

               గత ఎన్నికల్లో నగరంలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో, ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి, తమ అభిప్రాయమే శిరోధార్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. మతకలహాలకు విరుద్ధంగా సమైక్య నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌ను, మతకలహాలతో మంటలు మండించాలనేది కాంగ్రెస్ సంకల్పంగా కనిపిస్తోందన్నారు. నగరాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి వేరుచేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని సాయిబాబా ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్– ఎంఐఎంలు కలిసి పనిచేసిన తీరు చూస్తే, మిత్రపక్షాలని స్పష్టమవుతుందన్నారు. ముఖ్యమంత్రి హైడ్రాను తన దత్తపుత్రికలా పెంచి పోషిస్తూ, దానికి మితిమీరిన అధికారాన్నిచ్చి తన వ్యతిరేకులపై, పేదలపై ప్రయోగించడం అమానుషమ‌ని విమ‌ర్శించారు. పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తోంద‌న్నారు.

                         పేదల ఇళ్లు కూల్చివేస్తున్న ప్రభుత్వం, ఓవైసీ కాలేజీ కూల్చమని కోర్టు ఆదేశాలు ఇచ్చినా, విద్యా సంవత్సరం దెబ్బతింటుందనే సాకుతో దానిపై చర్యలు తీసుకోకపోవడం మిత్రబంధాన్నినిరూపిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. 50 గజాల ఇల్లు కట్టుకున్న పేదోడి ఇంటిని కూలగొట్టడం గొప్ప కాదని.. దమ్ము, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి తన సొంత పార్టీ నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్‌లను, ఓవైసీ కాలేజీలను వాటిని కూలగొట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కోర్టు ఎన్నిచీవాట్లు పెట్టినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ముఖ్యమంత్రి అండతో హైడ్రా శక్తివంతమైన ఆయుధంలా వ్యవహరిస్తోందని సాయిబాబా అన్నారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఎంఐఎం కనుసన్నల్లో జరుగుతున్న వార్డుల పునర్విభజన విధానాన్ని నిలిపివేయాలని, విభజన సరళిని ప్రజల ముందుపెట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని సాయిబాబా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, నగు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page