తార్నాక, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) : వైవిధ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ( కీళ్ల వాతం ) వచ్చే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ( ఎన్ఐఎన్ ), హైదరాబాద్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్కు చెందిన 18–55 ఏళ్ల 615 మందిపై నిర్వహించిన పరిశోధనలో కీళ్ల వాతం ఉన్నవారితో పోలిస్తే ఆరోగ్యవంతుల ఆహారంలో వైవిధ్యం, సూక్ష్మ పోషకాల లభ్యత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కీళ్ల వాతం ఉన్నవారిలో శరీరంలో వాపును పెంచే ఆహారం తీసుకునే స్థాయి కూడా అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆహారంలో వాపును పెంచే లక్షణాలు ఒక స్థాయి పెరిగితే కీళ్ల వాతం వచ్చే అవకాశాలు 17 శాతం పెరగగా, ఆహార వైవిధ్యం ఒక స్థాయి పెరిగితే 27 శాతం తగ్గినట్లు అధ్యయనం తెలిపింది. సూక్ష్మ పోషకాల లభ్యత 10 శాతం పెరిగినప్పుడు ఈ అవకాశాలు 12 శాతం తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇది కారణ–ఫలిత సంబంధాన్ని నిర్ధారించే అధ్యయనం కాదని, ఆహార మార్పులతో కీళ్ల వాతాన్ని నివారించగలమా లేదా నియంత్రించగలమా అనేది భవిష్యత్ అధ్యయనాలతో నిర్ధారించాల్సి ఉందని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి తెలిపారు. ఈ పరిశోధన ‘ న్యూట్రియంట్స్ ’ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైంది.
వైవిధ్యమైన ఆహారంతో కీళ్ల వాతానికి ముప్పు తక్కువ – ఐసిఎంఆర్-ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి
RELATED ARTICLES
