జీహెచ్ఎంసి ‘ పేరు గొప్ప ఊరు దిబ్బ’ గా మారింది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, నవంబర్ 26, అద్దం న్యూస్ :      గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసి ) ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేదని, కానీ ఇటీవల కాలంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం హయాంలో కూడా కేవలం ‘ పేరు గొప్ప ఊరు దిబ్బ ‘ అన్నట్టుగా తయారైందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా విమర్శించారు. బుధ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… న‌గ‌రంలోని ప్రజలు ప్రధాన సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలో ఎటు చూసినా పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వర్షాకాలంలో సామాన్య ప్రజలు ఎలా బతకాలో తెలియక అల్లకల్లోలం అవుతున్నా, వారి దుర్భర పరిస్థితులను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని విమ‌ర్శించారు. నగరంలోని శాసన సభ్యులు, కార్పొరేటర్లు మందబలం గురించి చెప్పుకోవడం తప్పా, ఏ ఒక్క ప్రజా సమస్యపైనా స్పందించడం లేదన్నారు. పారిశుద్ధ్య నిర్వాహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, దోమలు, ఇతర వ్యాధులు ప్రబలుతున్నా ఫాగింగ్ చేయడం లేదు, వ్యాధుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల పట్ల మున్సిపల్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమ‌ర్శించారు. జీహెచ్ఎంసీ కేవలం పన్నుల వసూళ్ల కోసమేనా ? జీహెచ్ఎంసి కేవలం ప్రాపర్టీ టాక్స్ ( ఆస్తి పన్ను ) వసూలు కోసమే పని చేస్తున్నదన్న వైఖరి దృఢ పడిందన్నారు. ముఖ్యమంత్రి అంతంత మాత్రంగా ఉన్న కార్పొరేషన్‌లో కొంత భాగాన్ని, కొన్ని బాధ్యతలను హైడ్రాకు అప్పచెప్పడంతో మున్సిపల్ వాళ్ళు హైడ్రా వాళ్ళు చేస్తారని, హైడ్రా వాళ్ళు మున్సిపల్ వాళ్ళు చేస్తారని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని చేతులు దులుపుకుంటున్నారని ధ్వ‌జ‌మెత్తారు. తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. కౌన్సిల్ సమావేశం పై విమర్శలు- నిన్న జరిగిన కౌన్సిల్ చివరి సమావేశంలో, వీరు నగరానికి ఏదో సేవ చేస్తున్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి 15, సుమారు రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్‌ను శాంక్ష‌న్ చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని ముచ్చట్లు పెట్టుకుని వెళ్లిపోవడం తప్పితే చేసిన అభివృద్ధి శూన్యం అని సాయిబాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తరణ నిర్ణయంపై నిరంకుశ వైఖరి -నగరం చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలలో, 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసి మహానగరంగా రూపొందించే సవరణ విధానం నగరానికి సరిపోతుందో లేదో ఒకసారి గమనించాలని ఆయన అన్నారు.
స్థానికంగా ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా మున్సిపాలిటీలను కలుపుతున్నారా ? అని సాయిబాబా ప్రశ్నించారు. అభిప్రాయ సేకరణ జరుపకుండా నిరంకుశంగా, నిర్బంధంగా వాటిని జీహెచ్ఎంసీలో కలుపుకోవడం చాలా విచారకరమైన విషయమ‌న్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ పెద్దదిగా ఉన్నప్పుడు విలీనం చేస్తే, స్థానిక ప్రజల అభిప్రాయాలు, సాధక బాధకాలు పరిగణనలోకి తీసుకొని దానికి అనుగుణంగా స్పందించేవారు… కానీ ఇప్పుడు అవేమీ లేకుండా ఆదరా బాదరాగా, ఆగమేఘాల మీద విలీనం చేసుకోవడం దేనికి సంకేతం ప్ర‌శ్నించారు. విలీనం అనంతరం నగర వైశాల్యాన్ని 2,735 చదరపు కిలోమీటర్లు పెంచి, 2 కోట్ల జనాభాతో మినీ తెలంగాణగా మారుతుందని చెప్పుకుంటూ, దానిని మూడు లేదా నాలుగు భాగాలు చేస్తామని వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైనది కాదన్నారు. అసలు తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చేస్తున్నారో కనీసం ప్రజలకు వివరించకుండా విలీనం చేశారన్నారు. ఇక ఇంత మహానగరంగా రూపొందిస్తే మీరు చేయవలసిన పనులు ఎలా చేయగలరు ? సాయిబాబా ప్ర‌శ్నించారు. ప్రభుత్వాన్ని ఆలోచనా సరళి ఏమైనా ఉంటే వాటిని వెంటనే బయట పెట్టాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page