తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలో
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 15, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వేడుకల సందర్బంగా సమయాభావ పరిస్థితుల వల్ల వారి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులందరూ జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… 79 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని 80 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పటేల్.. పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు ( BC, SC ) రాజ్యాధికారం, రాజకీయ గుర్తింపు లభించాయని పేర్కొన్నారు. పాలిట్‌బ్యూరోతో పాటు స్పీకర్, హోమ్, ఫైనాన్స్, రెవెన్యూ వంటి కీలక మంత్రి పదవుల్లో బలహీన వర్గాలకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు.

చంద్రబాబు నాయుడు హయాంలో సైబరాబాద్ నిర్మాణం, ఐటీ కంపెనీల ఏర్పాటు, విద్యాసంస్థల విస్తరణ (ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు) ద్వారా నిరుద్యోగులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు ( రోడ్లు, స్కూళ్లు, మంచినీటి చెరువులు, ట్యాంకులు ) అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై విమర్శిస్తూ మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు మళ్లీ రాజ్యాధికారం లభించాలన్నా, సమగ్ర అభివృద్ధి జరగాలన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… అనేక మంది మహనీయుల పోరాటాలు, అపార త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుస్తున్నామని అన్నారు. మహనీయులు ప్రాణాలర్పించి సాధించి పెట్టిన స్వాతంత్య్ర ఫలాలను కేవలం మనం అనుభవించడమే కాక, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, దేశ సమగ్రత, అభివృద్ధి కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి విభాగం మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షుడు పి.అశోక్, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్, నాయకులు తడక వినోద్, శ్యాంసుందర్, సుదర్శన్ రెడ్డి, కరణం కిరణ్, భాను ప్రకాష్, సుదర్శన్ రెడ్డి, పరుశు రామ్, చంద్రమోహన్ గౌడ్, కట్ట రాములు, సిహెచ్.ప్రదీప్ గౌడ్, ఎస్ఎం.లయీఖ్, భవాని శ్రీనివాస్, ఎస్.ప్రకాష్, జగదీష్ గౌడ్, మచ్చేందర్, యాదగిరి, బి.రాజు, గాదె అనిల్, శక్తి ప్రేమ్ తదితరలు పాల్గొన్నారు.













Leave a Reply