అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులంద‌రికి ఇళ్ల స్థ‌లాల‌ను ఇవ్వాలి

అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులంద‌రికి ఇళ్ల స్థ‌లాల‌ను ఇవ్వాలి
ముఖ్యమంత్రికి జిహెచ్‌జె సొసైటీ సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి

హైద‌రాబాద్‌, జూన్ 3, ( అద్దం న్యూస్ ) :   సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ప్రకారం అన్ని కేటగిరీల్లోని జర్నలిస్టులకు అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… సొసైటీలో సభ్యత్వం తీసుకున్న 1350 మంది గ్రేటర్ జర్నలిస్టులు 18 ఏళ్ళుగా ఇంటి స్థ‌లాల‌ కోసం ఎదురు చూస్తున్నారని, గత ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని, కనీసం ఈ ప్రభుత్వం అయినా ఇళ్ళ స్థలాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులు స్థలం పొందకుండానే చనిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని, మొన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ళస్థలాలపై ఎటువంటి నిర్ణయం లేదని, నిన్న జరుపుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో జర్నలిస్టుల సంక్షేమం, ఇళ్ళస్థలాల మాటే లేదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ జీవోల ద్వారా జర్నలిస్టు సొసైటీలకు స్థలాలు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పలువురు మంత్రులను కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ స్థలం కేటాయింపునకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ, తెలంగాణ జనసమితి గ్రేటర్ బీసీ సెల్ అధ్యక్షుడు జశ్వంత్, సీనియర్ జర్నలిస్టులు శాంతి, నాగవాణి, సొసైటీ కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు రామారావు. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మద్దతు ప్రకటించిన కోదండరాం :
సొసైటీ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాల్సి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అనివార్యకారణాల వల్ల హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన ఫోన్ ద్వారా తన సందేశాన్ని సమావేశానికి వినిపించారు. గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి తన మద్దతు ఉంటుందని, ముఖ్యమంత్రితో మాట్లాడి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా సమావేశానికి రావాల్సిన రాజ్యసభ సభ్యులు ఎం. అనిల్ కుమార్ యాదవ్ కూడా అత్యవసర పని వల్ల రాలేకపోయారు. ఆయన కూడా సొసైటీ సమావేశానికి మద్దతు తెలియజేశారు.

స‌మావేశంలో చేసిన తీర్మానాలు :
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ప‌లు డిమాండ్ల‌పై తీర్మానాలు జ‌రిగాయి. జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలు, సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి స్థలం లేదా సభ్యులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ స‌మావేశం తీర్మానించింది. అక్రెడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం ఇవ్వాలని, జర్నలిస్టుల్లో వివక్ష చూపొద్దని సమావేశం కోరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్న అన్ని కేటగిరీల జర్నలిస్టులకు 200 గజాల‌ స్థలాన్ని ఫ్యూచర్ సిటీలో కేటాయించాలని కోరుతూ సమావేశం తీర్మానించింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page