ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు – ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు… ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి
– హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం మానవహారంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్

హైద‌రాబాద్‌, జూన్  5, ( అద్దం న్యూస్ ) :    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు – ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( హెచ్‌సిఎఫ్ ) ఆధ్వర్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్‌ ట్యాంక్ బండ్ పైన ” సేవ్ హైదరాబాద్ ” అనే నినాదంతో మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెస‌ర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ… ప్రస్తుతం నగరీకరణ వేగంగా పెరుగుతున్నదని, కానీ దానికి తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పన జరగటం లేదని అన్నారు. ప్రభుత్వాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా సౌకర్యాల కల్పనకు ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రైవేట్‌ నిర్మాణాలలో గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణాలు జరగాలని, దాని వలన విద్యుత్ వినియోగం తగ్గుతుందని అన్నారు. ఈ మొబిలిటీ పెరగాలని దానివల్ల శిలాజ ఇంధనాల వినియోగం తగ్గుతుందని, కాలుష్యాన్ని తగ్గించవచ్చని సూచించారు. భూగర్భం, గాలి, నీటి వనరులు కాలుష్యం అవుతున్నాయని, డ్రైనేజీని య‌థేచ్చ‌గా మంచినీటి చెరువులలో వదులుతున్నారని, ఫలితంగా మంచినీటి వనరులు కలుషితమవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్, మూసి శుద్ధి కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా వింటున్నాం కానీ.. ఆచరణ నోచుకోవటం లేదని అన్నారు. నగరం అభివృద్ధికి కేంద్రాలని, పర్యావరణ హితంగా నగరాభివృద్ధి జరగాలని, అప్పుడే ప్రజలకు దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగమని అన్నారు.

అర్బన్ డెవల‌ప్‌మెంట్‌ ఫోరం ( యుడిఎఫ్ ) రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ…. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క వ్యక్తికి 100 చెట్ల చొప్పున ఉండాలని, కానీ హైదరాబాద్ నగరంలో 18 చెట్లు మాత్రమే ఉన్నాయని, ఇది మన కర్తవ్యాన్ని సూచిస్తున్నదని అన్నారు. అర్బన్ ప్లానింగ్ లో కూడా అనేక మార్పులు రావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అందుకు హెచ్‌సిఎఫ్‌యుడిఎఫ్ లాంటి పౌర సంస్థలు కృషి చేయాలని అన్నారు.

హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షుడు మల్లం రమేష్ వందన సమర్పణ చేశారు. గ్లోబల్ వార్మింగ్ నివారించాలని, ప్లాస్టిక్ ను నియంత్రించాలని, హుస్సేన్ సాగర్, మూసీ శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, కాలుష్యాన్ని నివారించాలని ఆకర్షణీయ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు ఆర్.మాణిక్, హెచ్‌సిఎఫ్ కార్యకర్తలు ఎం.శ్రీనివాసరావు, పి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, సంగీత, అస్మిత, లలిత, రితేష్, సుకుమార్, గోపాల్, మోహన్, నర్సింగ్ రావు, శ్రీవల్లి, శంకర్, రమేష్, శంకరయ్య, రఘు, సైదులు, శ్రీనివాస్, కృష్ణమోహన్ తదితరులు నాయకత్వం వహించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page