Saturday, October 17, 2026
No menu items!
HomeAPస్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడం దురదృష్టకరం – రాజ్య‌స‌భ స‌భ్యుడు,...

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడం దురదృష్టకరం – రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌

📰 Generate e-Paper Clip

బ‌షీర్‌బాగ్, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) :      స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని, బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తే చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో బీసీ సంఘాల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఆర్‌.కృష్ణ‌య్య హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా కృష్ణ‌య్య మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయడంతో పాటు, న్యాయస్థానం సూచనల మేరకు జనాభా గణన చేపట్టి అవసరమైన ఆధారాలు సమర్పించినప్పటికీ రిజర్వేషన్లను రద్దు చేయడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. గతంలో మూడు ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తు చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో పదేపదే న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దేశ జనాభాలో బీసీలు సుమారు 56 శాతం ఉన్నారని, అయినప్పటికీ విద్య, ఉద్యోగ రంగాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లభించడంలేదన్నారు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయని, చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా పరిష్కారం కావాల్సి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల్లోనూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ఠ పరిమితి విధించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన వివాదాలు తలెత్తాయని గుర్తుచేశారు.

కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు అధిక శాతం రిజర్వేషన్లు అమలవుతున్న నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల విషయంలోనూ జనాభా నిష్పత్తికి అనుగుణంగా న్యాయం చేయాలని కోరారు. రిజర్వేషన్లపై ఉన్న పరిమితులను అధిగమించి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలను వినియోగించుకుని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రితో చర్చలు జరిపి రాజ్యాంగ సవరణకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో న్యాయమైన వాటా దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ క‌న్వీన‌ర్ సి.రాజేందర్ ముదిరాజ్‌, జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కురుమ రామాంజనేయులు, రాష్ట్ర బీసీ ఐక్యకులాల వేదిక అధ్యక్షుడు అనంతయ్య, రాష్ట్ర బీసీ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు పర్లగోర్ల మోడీరాందేవ్, రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బిసి జాగృతి సేన రాష్ట్ర అధ్య‌క్షుడు బూర్గుప‌ల్లి కృష్ణ యాద‌వ్‌, బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు భీమరాజ్, రాష్ట్ర బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షుడు ఎం.పృథ్వీ గౌడ్, బీసీ, ఎస్సీ, రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎ.జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page