...

జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

      జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర

– సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగదు

– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జగిత్యాల, ఆగ‌స్టు 26, అద్దం న్యూస్ :    జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘ కాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సర్వసభ్య సమావేశం, జర్నలిస్టుల జాయినింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా, జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర చేస్తామని, ఈ యాత్ర జగిత్యాల నుంచే ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. సమస్యలపై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చా రు. రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల జీవన స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా మండలస్థాయి విలేకరుల పరిస్థితి ఆధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం కూడా అదే బాటలో నడుస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మ రించాయని ఆయన విమర్శించారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు జర్నలిస్టుల పేరు చెప్పి అధికార పదవులు పొంది పాలకులకు ఊడిగం చేస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ సంఘాల పట్ల జర్నలిస్టులు పూర్తి విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు. గత ప్రభుత్వం గానీ, ఈ ప్రభుత్వం గానీ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టు కేసుల సాకుతో అన్యాయం చేశాయని అన్నారు. చాలా ఏళ్ళుగా చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తుందని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సంఘాల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో టీయూడబ్ల్యూజే- ఐజేయు సంఘాల నుంచి చాలా మంది జర్నలిస్టులు ఫెడరేషన్ లో చేరడం ద్వారా సంఘం మరింత బలపడిందని అన్నారు. ఫెడరేషన్ లో చేరిన ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ ఇమ్రాన్, నాయకులు కోటగిరి ధశరథం, గుండేటి రాజు తదితరులను ఆయన అభినందించారు.

ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుడితాడు బాపురావు తదితరులు మాట్లాడుతూ… జగిత్యాల జిల్లాలో ఫెడరేషన్ ను మరింత బలోపేతం చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతం పోరాడుతూ… జర్నలిస్టులకు అండగా ఉంటుందని అన్నారు. విలేకరులు పాలకుల ముందు తలవంచకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు ద్యావర సంజీవ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు జైపాల్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎన్నం కిషన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రవీందర్ రావు, ఉపాధ్యక్షులు రాగం రమేష్, శ్రీనివాస్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి లింగారెడ్డి, సహాయ కార్యదర్శి కాంతారావు, కోశాధికారి శ్రీనివాస రావు, కార్యవర్గ సభ్యులు సీహెచ్ రోజా, బి.లావణ్య తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా క‌మిటీ ఏర్పాటు :

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా నూత‌న క‌మిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా మహ్మద్ ఇమ్రాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా ద్యావర సంజీవరాజు ను రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. వీరితో పాటు జిల్లా ఉపాధ్యక్షుడిగా కోటగిరి దశరధం, సాంస్కృతిక కార్యదర్శిగా గుండేటి రాజు ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.