హైదరాబాద్, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ( TS HOUSE FED ) నూతన చైర్మన్‌గా ముదుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా బ్రహ్మాండబేరి గోపరాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన TS HOUSE FED డైరెక్టర్ల ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు సోమవారం సమావేశమై చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన ఎన్నికల అధికారి చంద్రమోహన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముదుగంటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలోని కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు టిఎస్ హౌస్ఫెడ్ను మరింత అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ఫెడరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు సమకూర్చి ఫెడరేషన్‌ను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలోపేతం చేస్తామని చెప్పారు. ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలోని హౌసింగ్ సొసైటీలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, వాటి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణలోని కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీలకు అవసరమైన రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చి, హౌసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రతి సొసైటీ సభ్యుడి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఫెడరేషన్ లక్ష్యమని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో ఫెడరేషన్ నుంచి సొసైటీలు పొందే రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా సొసైటీలు కూడా ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. సొసైటీలు బలోపేతం అయితేనే ఫెడరేషన్ మరింత బలపడుతుందని తెలిపారు.
సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తాం : వైస్ చైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజు
నూతనంగా ఎన్నికైన వైస్ చైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజు మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్న డైరెక్టర్లకు, ఎన్నికకు సహకరించిన అన్ని హౌసింగ్ సొసైటీల అధ్యక్షులు, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ ముదుగంటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డైరెక్టర్ల సమన్వయంతో పనిచేస్తూ TS HOUSE FED ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హౌసింగ్ సొసైటీల సభ్యులకు రుణ సదుపాయాలను మరింత సులభతరం చేయడంతో పాటు, సొసైటీల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఫెడరేషన్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు. ప్రతి సభ్యుడికి సొంత ఇంటి కలను సాకారం చేయడంలో ఫెడరేషన్ తన వంతు పాత్ర పోషించేలా కృషి చేస్తామని తెలిపారు.ఫెడరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం పొందుతూ, సొసైటీలను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని గోపరాజు పేర్కొన్నారు. నూతన పాలకవర్గం, డైరెక్టర్లతో కలిసి సమష్టిగా పనిచేసి ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్రంలోని వివిధ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల అధ్యక్షులు, ప్రతినిధులు, సభ్యులకు నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ హౌస్‌ఫెడ్ ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ… హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ నూతన కార్యవర్గం సహకార స్ఫూర్తితో పనిచేసి ఫెడరేషన్‌తోపాటు సభ్య సొసైటీలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా TS HOUSE FED ఎండి జి.లక్ష్మీభాయి నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముదుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్, కిషన్‌రావు, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

