పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిల‌ను చెల్లించాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.క్రిష్ణ‌య్య

పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిల‌ను చెల్లించాలి

– రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.క్రిష్ణ‌య్య


హైదరాబాద్, ఆగ‌స్టు 01, అద్దం న్యూస్ :   పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయకుండా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, స్కాల‌ర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.క్రిష్ణ‌య్య డిమాండ్ చేశారు. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు వేముల రామ‌క్రిష్ణ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్ ఇందిరాపార్కు ధ‌ర్నాచౌక్‌లో విద్యార్థుల భారీ నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న‌, ధ‌ర్నా జ‌రిగింది. ఈ ధ‌ర్నాకు మ‌ద్ద‌తుగా రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.క్రిష్ణ‌య్య‌, సిసిఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌, ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌, బిసి క‌మిష‌న్ మాజీ ఛైర్మ‌న్ వ‌కుళాభ‌ర‌ణం క్రిష్ణ‌మోహ‌న్‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌.క్రిష్ణ‌య్య మాట్లాడుతూ… 14 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. 119 బిసి గురుకులాలు మంజూరు చేయాల‌ని, బిసి గురుకుల పాఠ‌శాల‌లో 20 శాతం సీట్లు పెంచాల‌ని డిమాండ్ చేశారు. పేద విద్యార్ధుల భవిష్య‌త్‌ను నిర్దేశించే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకాన్ని పాలకులు విస్మరించడం సరి కాదన్నారు. విద్య రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన హ‌క్కు అని, ఎస్సీ, ఎస్టీ, బిసిల‌కు అభివృద్ధికి ఉపయోగ‌ప‌డే ఈ స్కీమును ప్ర‌భుత్వం ఉద్ధేశ్య‌పూర్వ‌కంగా నీరుకారుస్తుంద‌ని మండిప‌డ్డారు. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దే ఈ ప‌థ‌కానికి 6 వేల కోట్లు అప్పు తెస్తే ఎవ‌రు అడ్డుకుంటార‌ని ప్ర‌శ్నించారు. పైగా ఈ ప‌థ‌కానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఈ 20 నెల‌ల కాలంలో 20 రూపాయ‌లు కూడా విడుద‌ల చేయ‌లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఎస్సీ, ఎస్టీల‌కు ఈ ప‌థ‌కం కింద వేల కోట్లు కేటాయిస్తోంద‌ని, వీటిని ఏం చేస్తున్నార‌ని క్రిష్ణ‌య్య ప్ర‌శ్నించారు. ప‌క్క రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు ద‌ఫాలుగా 1500 కోట్లు విడుద‌ల చేశార‌ని, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫీజులు, స్కాల‌ర్‌షిప్‌లు విడుద‌ల చేయ‌కుండా విద్యార్థుల భ‌విష్య‌త్‌లో చెల‌గాట‌మాడుతున్నార‌ని విమ‌ర్శించారు. మ‌రో వైపు ఫీజు బ‌కాయిలు చెల్లించ‌కుండా ఇంకొక వైపు ఫీజుల స్కీములు ఎత్తివేయ‌డానికి ట్ర‌స్ట్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఫీజులు చెల్లిస్తామ‌ని కొత్త నాటకానికి తెర‌లేపార‌న్నారు. ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లు మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు విద్యార్థులు ఫీజు బకాయిలతో చెలగా టమాడుతున్నారని విమర్శించారు. స్కాలర్ షిప్స్, ఫీజు బకాయిలు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ నీల వెంకటేష్, నంద గోపాల్, పగడాల సుధాకర్, శివకుమార్ యాదవ్, మనీష్ ఠాకూర్, శివ యాద‌వ్‌, చంద్రశేఖర్ గౌడ్, తిరుమలేశ్, కోలా జనార్ధన్, ప్ర‌సాద్, రాందేవ్ మోదిల‌తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page