నిరుద్యోగుల‌ను ఘోరంగా మోసం చేసిన రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వం – తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌

తెలంగాణ బ్యూరో, అక్టోబ‌ర్ 9, అద్దం న్యూస్ :     ఎక్కడైతే రాహుల్ గాంధీ అబద్దపు మాటలు చెప్పి నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారో అదే ప్రాంతానికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత అన్నారు. ఈ ముఖ్యమంత్రి మాటకారి.. ఆయన చేయాల్సి పని చేయకుండా ప్రతిపక్షాలను తిడుతున్నారు. గ్రూప్ – 1 నియామకాల అవకతవకల పై సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ… సీఎం, డిప్యూటీ సీఎం లు విద్యార్థుల సమస్యలపై మాట్లాడకుండా వారిని అవమానిస్తున్నారన్నారు. తెలంగాణ బిడ్డలమైనా మనం ఆకలైనా భరిస్తాం, కానీ అవమానాన్ని భరించమ‌న్నారు. గత 6 నెలలుగా ఈ ప్రభుత్వ వైఖరిని చూస్తున్నామ‌ని, ఇక లాభం లేదని పోరాటానికి సిద్ధమయ్యామ‌న్నారు. గ్రూప్-1 కు సంబంధించి వారం రోజుల పాటు పోరాటాలు చేస్తామ‌న్నారు. సిటీ లైబ్రరీ, అశోక్‌న‌గ‌ర్‌లో రాహుల్ గాంధీ అబద్దపు అంశాలను ఎలా ముందుకు తెచ్చారో అదే ప్రాంతానికి వెళ్లి మనం నిరసన తెలుపుతామ‌ని, రేపు అశోక్ నగర్ లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామ‌ని క‌విత స్ప‌ష్టం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం అటెన్షన్ ను ఆట్రాక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామ‌ని, తెలంగాణ జాగృతి చాలా సందర్భాల్లో ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఇప్పుడు మీరు చేసే పోరాటంలో కచ్చితంగా న్యాయపోరాటానికి మేము అండగా ఉంటామ‌ని, జాగృతి అయిన సరే, కవిత అయిన సరే ప్రజలకు కష్టం వచ్చిందంటే ఊరుకునే రకం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పేగులు తెగేదాకా, అలసి పోయే వరకు పోరాటం చేశామ‌ని తెలిపారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటామ‌న్నారు. తెలంగాణ వచ్చాక కూడా మన యువకులు ఇంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదని, మన పిల్లల్ని బాధపెట్టే విధంగా ఈ ప్రభుత్వాలు ఉండకూడదని.. ఏదైనా పొరపాటు జరిగితే సరి చేసుకోవాలన్నారు. తెలంగాణ వచ్చాక మొదటి 10 ఏళ్లలో కేసీఆర్ విద్యార్థుల కోసం చేయాల్సినంత చేశారని… ఐతే దురదృష్టవశాత్తు మనం గ్రూప్-1 పరీక్ష నిర్వహించుకోలేకపోయాం, కానీ గత ప్రభుత్వం ఎప్పుడు విద్యార్థుల మీద కోపం పెట్టుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం మాత్రం విచిత్రంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల మీద కూడా కేసులు పెడుతోందన్నారు. గ్రూప్-1 ఇష్యూను నేను ఒక తల్లి కోణంలో చూస్తున్నానని… ఒక కుటుంబంలో ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ తల్లులకు స్వాంతన ఉంటుందని భావించాం, కానీ ఇప్పటికీ మళ్లీ కొట్లాడాల్సి వస్తోందని అయితే కొట్లాడాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా కొట్లాడాల్సిందేన‌ని క‌విత స్ప‌ష్టం చేశారు. గత రెండేళ్లలో ఉద్యోగాలు, బీసీలకు న్యాయం చేయాలని వందసార్లు అడిగామ‌న్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లు ఎందుకు ప్రశ్నించరు ? అని నిల‌దీశారు. అసలు ఢిల్లీ పంచాయితీకి ఇక్కడి కాంగ్రెస్ నేతలు గల్లీ మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక…కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ప్రజలను పూర్తిగా వదిలేశారని విమ‌ర్శించారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారన్నారు. జీవో 29 రద్దు అయ్యే వరకు కంప్లీట్ గా పోరాటం చేస్తామ‌ని, హైదరాబాద్‌లో మాత్రమే కాదు… జిల్లాలు, ఊర్లు, గ్రామాలకు వెళ్లి పోరాటం చేస్తామ‌న్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఇప్పటికీ రష్యా యూనివర్సిటీలో పాఠాలుగా చెప్తున్నారని, తెలంగాణ వచ్చాక మన విద్యార్థులు కడుపులో చల్ల కదలకుండా సచివాలయంలో ఉద్యోగాలు చేస్తారని ఆశపడ్డా.. కానీ వాళ్లంతా రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. మా తరం నష్టపోయిన సరే ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలని అనుకున్నాం…. కానీ వారికి కూడా అన్యాయం జరుగుతోందన్నారు. గత వందేళ్లుగా తెలంగాణ చరిత్ర పోరాటాలు, రక్తంతో తడిచిందని.. ఇంకా ఎప్పుడు బాగుపడేదన్నారు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉద్యోగాలు సాధించేలా కష్టపడాల‌ని సూచించారు. మీ తరఫున మేము పోరాటం చేస్తామ‌ని.. ప్రభుత్వానికి బుద్ది చెబుతామ‌న్నారు. తెలంగాణ విద్యార్థులు నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉండాలని, వారి బాగు కోసం ఒక అమ్మలా ఆలోచిస్తున్నాన‌న్నారు. మా న్యాయ విభాగం వారియర్స్ మాదిరిగా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని… ఇప్పటికే 50 లాయర్ల టీమ్ ఉందన్నారు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టమ‌ని.. తెలుగు బాగుండాలని కోరుకుంటాన‌ని, కానీ తెలుగులో రాస్తే ఉద్యోగాలు రాని పరిస్థితి ఏంటీ ? అని అన్నారు. ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం జరగడంలేదన్నారు. ఊర్లో వాళ్లు కోర్టులు అంటే భయపడుతున్నారన్నారు. ఇక ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు కూడా తెలుగు రాకపోతే ఏంటీ పరిస్థితి ? అని అన్నారు. కచ్చితంగా గ్రూప్ -1 లో తెలుగులో రాసే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం ఐదు తీర్మానాలు చేశారు. గ్రూప్ -1 నియామకాలు రద్దు చేసి… తిరిగి ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలి. గ్రూప్-1 రిజల్ట్ చివరికంటా పోరాటం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ అమలయ్యే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని తీర్మానించామ‌ని, 2 లక్షల ఉద్యోగాల పూర్తి స్తాయిలో ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాటం చేస్తామ‌ని, టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా ఉన్న జీవో 29 ను రద్దు చేయాలని మొత్తం ఐదు తీర్మానాలను చేశామ‌ని ఐదు తీర్మానాలను గవర్నర్, సీఎంలకు పంపిస్తామ‌న్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page