ఆర్‌టిఐ చట్టాన్ని కాపాడుకోవాలి – సమాజానికి పనికొచ్చే సమాచారాన్ని రాబట్టాలి – చర్చా గోష్టిలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

హైదరాబాద్, జూన్ 15, అద్దం న్యూస్ :   ఆర్‌టిఐ చట్టాన్ని కాపాడుకోవాలి – సమాజానికి పనికొచ్చే సమాచారాన్ని రాబట్టాలని ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ఆర్‌టిఐ చట్టం అమలు తీరు – పొంచి ఉన్న ప్రమాదాలు అనే అంశంపై హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( హెచ్‌సిఎఫ్ ), పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ( పిఎఫ్ఆర్ఐ ) సంయుక్తంగా ఆదివారం బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చర్చా గోష్టిలో కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ… ఆర్‌టిఐ చట్టం చాలా విశిష్టత కలిగినదని, దానిని సక్రమంగా వినియోగించాలని, పిచ్చి పిచ్చి ప్రశ్నలతో అధికారులను వేధించటం కొరకు కాక సమాజానికి, ప్రజానీకానికి ఉపయోగపడే సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నలను అడగాలని సూచించారు. కొంతమంది అధికారులు ప్రశ్న రూపంలో అడిగితే సమాచారం ఇవ్వటం లేదని, సమాచారం రాబట్టటం ప్రధానం తప్ప ఏ రూపంలో అడిగారు అనేది ప్రధానం కాదని అలాంటి వారికి ప్రశ్న రూపంలో కాకుండా కావలసిన సమాచారాన్ని రాబట్టే పద్ధతిలో అడిగి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే అతి గొప్ప సమాచార హక్కు చట్టం మనదేశంలో ఉన్నదని, అందుకు మనమంతా గర్వించదగిన విషయమని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై, మనందరిపై ఉన్నదని ఉద్భోదించారు.

ఈ సంద‌ర్భంగా ఆర్‌టిఐ కార్య‌క‌ర్త‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆర్‌టిఐ నిపుణులు శ్రీనివాస మాధవ్ చట్టాలను ఉదహరిస్తూ సమాధానాలు ఇచ్చారు. సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు సమాచారాన్ని ఇవ్వకుండా తప్పించుకునేందుకు అనేక వక్రమార్గాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. సమాచారం పొందటం ప్రజల హక్కుని, దాన్ని తిరస్కరించకుండా సమాచార హక్కు చట్టం రక్షణ కల్పిస్తున్నదని దానిని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలని ఆర్‌టిఐ కార్యకర్తలకు సూచించారు. గతంలో ఒక ఉన్నతాధికారి తనకు చెప్పకుండా ఆర్‌టిఐ సమాచారం ఇవ్వవద్దని సర్కులర్ జారీ చేశాడని, దానిపై ఒక ఆర్టీఐ కార్యకర్త లా స్టూడెంట్ హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు సదరు అధికారికి అక్షంతలు వేసిందని వెంటనే తను ఇచ్చిన సర్కులర్ ను వెనక్కి తీసుకున్నాడని, అది సమాచార హక్కు చట్టం పవర్ అని సోదాహరణగా వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాచారాన్ని పొందేందుకు ఆర్‌టిఐ కార్యకర్తలు చాలా శ్రమించాల్సి వస్తున్నదని అయినా అనేక మంది కార్యకర్తలు పట్టు వదలకుండా కృషిచేసి సమాచారాన్ని రాబట్టుకుంటున్నారని అభినందించారు. దురదృష్టవశాత్తు ఇతర రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాలలో ఆర్‌టిఐ చట్ట వినియోగం, సమాచారాన్ని ఇస్తున్న తీరు లోపభూఇష్టంగా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సమాచార హక్కును కాపాడాలని సూచించారు. ఆర్‌టిఐ యాక్టివిస్ట్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ…. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవడం ద్వారా తాను సమాచారాన్ని సేకరించి, కొంతమంది అవినీతి అధికారుల బండారాన్ని బయటపెట్టిన తీరును వివరించారు. సమాచారాన్ని ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం అధికారులు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారని వాటిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా సమాచారాన్ని రాబట్టుకునేందుకు పట్టువదలకుండా కృషిచేసి, ఇవ్వని అధికారులపై చర్య తీసుకునేలా పోరాడాలని సూచించారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి మాట్లాడుతూ… పీపుల్స్ ఫ్రంటు ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ ( పిఎఫ్ఆర్ఐ ) ఆధ్వర్యంలో ఆర్టీఐ చట్టాన్ని అమలుకు జరుగుతున్న కృషిని వివరించారు. ఈ చర్చా గోష్టి కి హెచ్‌సిఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, పిఎఫ్ఆర్ఐ అధ్యక్షుడు యాదయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్య‌క్రమంలో హెచ్‌సిఎఫ్ అధ్య‌క్షుడు ఎం.శ్రీనివాసరావు, నాయకులు పి.శ్రీనివాసరావు, సంగీత, రాజమౌళి, అస్మిత, లలిత, శ్వేత, సైదులు, గోపాల్, సుకుమార్, రమేష్, శంకరయ్య, అనేక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ చర్చాగోష్టిలో పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page