కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి అగ్నిగుండంలా మారిన తెలంగాణ
• టిడిపి నాయకుల ధ్వజం
హైదరాబాద్, ఫిబ్రవరి 10, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాల్‌రాజ్‌గౌడ్ లు ధ్వజమెత్తారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో 2025 సంవత్సరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాల గణాంకాలను వివరిస్తూ, ప్రభుత్వ అసమర్థత వల్లే 163 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఇప్పుడే ప్రస్తుత సమయంలో మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. 2025 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,861 అగ్నిప్రమాదాలు సంభవించాయని, 2019 తర్వాత అగ్నిమాపక శాఖకు ఇన్ని భారీ స్థాయిలో కాల్స్ రావడం ఇదే మొదటిసారి అని, ఇది ప్రభుత్వ నిఘా వైఫల్యమేనని వారు పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్‌లో 2023లో కేవలం 1 గా ఉన్న అగ్నిప్రమాద మరణాల సంఖ్య, 2025 నాటికి 51 కి చేరడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య 2023లో 767 ఉండగా, అది 2025 నాటికి 835 కి పెరగడం ప్రణాళిక లోపాలను ఎత్తిచూపుతోందని వారు విమర్శించారు.
పాతబస్తీలోని ఇరుకైన దారులు, భవన నిర్మాణ లోపాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 17 మంది సజీవ దహనమయ్యారని, అగ్నిమాపక వాహనాలు వెళ్లలేని పరిస్థితులే గుల్జార్ హౌజ్ మరణాలకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. పశమైలారంలో రసాయన పరిశ్రమ ( సిగాచీ ఇండస్ట్రీస్ ) లో జరిగిన పేలుడులో సుమారు 54 మంది ( 46 మంది మృతి, 8 మంది గల్లంతు ) కార్మికులు మరణించడం 2014 తర్వాత జరిగిన అతిపెద్ద పారిశ్రామిక విపత్తు అని గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల కొరత వల్ల రికార్డు స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నా, కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటులో కానీ, ఆధునిక పరికరాల సేకరణలో కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.
నిబంధనల ఉల్లంఘించి నివాస ప్రాంతాలకు సమీపంలో ప్రమాదకర రసాయన యూనిట్లకు అనుమతులు ఇవ్వడం, భద్రతా ఆడిట్‌లు నిర్వహించకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, సిగాచీ వంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం కేవలం “విచారణ కమిటీల” పేరుతో కాలయాపన చేస్తోందని, బాధ్యులైన అధికారులపై లేదా బిల్డర్లపై ఏలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 2025 లో జరిగిన భారీ అగ్నిప్రమాదాలపై జుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాణిజ్య, నివాస సముదాయాల్లో, ప్రైవేటు స్కూళ్లలో పర్యవేక్షణ చేపట్టి, భద్రతా ప్రమాణాలను పాటించని వాణిజ్య సముదాయాలను, స్కూళ్లను సిజ్ చేయాలని, అగ్నిమాపక శాఖను తక్షణమే ఆధునీకరించి, త్వరితగతిన స్పందించే విభాగాలను బలోపేతం చేయాలని, బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరిని వీడాలని నాయకులు డిమాండ్ చేసారు. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే జరిగే ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తడక వినోద్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, కరణం కిరణ్, శ్యామ్ సుందర్, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply