Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADగన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మోతె శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం

గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మోతె శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం

📰 Generate e-Paper Clip

ఎర్రవల్లిలో అమరవీరుల కాలనీ నిర్మాణంపై ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 7, ( అద్దం న్యూస్ ) : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ పరిధిలో అక్రమాలకు గురైన 45 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘ తెలంగాణ అమరవీరుల కాలనీ ’ నిర్మించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ, వివిధ ఉద్యమ సంఘాలు, తెలంగాణ జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మోతె శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్ తో పాటు పలువురు ఉద్యమకారులు, కమిటీ సభ్యులు హాజరై మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను గౌరవించడం, నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, పక్కా సర్వే నిర్వహించి, అర్హులకు అందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో నిజమైన ఉద్యమకారులను గుర్తించడంతో పాటు, వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సెక్షన్ 22-ఏ పరిధిలోని నిషేధిత భూములపై విచారణ జరిపించి, అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం ఉద్యమకారుల పోరాటానికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. అర్హులైన అమరవీరుల కుటుంబాలు, నిజమైన ఉద్యమకారులు, స్థానిక రైతులకు మాత్రమే భూమి కేటాయించేలా పారదర్శక ప్రక్రియను పాటించాలని కోరారు. 

ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో భూమిని గుర్తించి, వచ్చే జూన్ 2 నాటికి అవసరమైన మౌలిక సదుపాయాలతో అమరవీరుల కాలనీని అభివృద్ధి చేయాలనే నిర్ణయం ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, నిజమైన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సీఎం ఆలోచనలో ఉందనడానికి ఈ నిర్ణయం స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. నకిలీ ఉద్యమకారులకు ఎలాంటి అవకాశం లేకుండా అర్హులను గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వానికి కమిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ ప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page