ముషీరాబాద్, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) : కచ్చా నాలా పై స్కూల్ యాజమాన్యం అక్రమంగా నిర్మించిన స్లాబ్ను తొలగించాలని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం జిహెచ్ఎంసి సర్కిల్-41 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… ముషీరాబాద్ డివిజన్ వినోభానగర్, జాంభవినగర్ ల మధ్య ఉన్న నాలా పై స్థానికంగా ఉండే మార్టినెట్ స్కూల్ యాజమాన్యం స్కూల్ వెనుక భాగంలో కచ్చా నాలాపై ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 12 మీటర్ల పొడవునా అక్రమంగా స్లాబు నిర్మించారన్నారు. ఈ స్లాబు పై నుండే విద్యార్థుల రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఈ స్లాబు పై నుంచి విద్యార్థుల రాకపోకలు కొనసాగిస్తే స్లాబు కూలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో వ్యక్తి ఈ నాలాలో పడి మృతి చెందాడని గుర్తు చేశారు. నాలాలో కొంత మంది భవన నిర్మాణ వ్యర్ధాలను వేశారని, దాని వల్ల వరద నీరు పొంగి లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి విద్యార్థులకు ప్రమాదం జరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని, నాలాపై అక్రమంగా వేసిన స్లాబును కూల్చి వేయాలని కోరారు. డిఎంసిని కలిసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు.
కచ్చా నాలా పై అక్రమంగా నిర్మించిన స్లాబును తొలగించాలి
RELATED ARTICLES
