గంగపుత్రుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంఘం చేస్తున్నసేవలు ప్ర‌శంస‌నీయం – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

గంగపుత్రుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంఘం చేస్తున్నసేవలు ప్ర‌శంస‌నీయం
మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 8, అద్దం న్యూస్ :   గంగపుత్రుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంఘం చేస్తున్నసేవలు ప్ర‌శంస‌నీయమ‌ని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. తెలంగాణ గంగపుత్ర సంఘం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ, తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు గంగ‌పుత్ర సంఘం ఆధ్వ‌ర్యంలో రూపొందించిన డైరీని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… గంగ నది ఎంత పవిత్రమో అంతే గంగపుత్రులు కూడా పవిత్రులని, వారు సమాజానికి సేవచేసే గొప్ప వ్యక్తులని అన్నారు. విద్యతోనే గౌరవం, కీర్తి దక్కుతాయని, గంగపుత్ర చిన్నారులందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గంగపుత్ర సంఘం తరఫున ఉచిత విద్యతో పాటు హాస్టల్ సౌకర్యాలు కల్పించి పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. మత్స్య‌కారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే దళారుల వ్యవస్థను అరికట్టాలని, ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చూడాల‌న్నారు.

     రాజకీయాల్లో గంగపుత్రుల పాత్ర మరింత పెరగాలని ద‌త్తాత్రేయ ఆకాంక్షించారు. ఎనిమిది నుంచి పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అడుగు పెట్టే స్థాయికి రావాలని అన్నారు. యువత సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. విద్య, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల్లో మరింత ముందుకు సాగాలని వారు సూచించారు. తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌డ‌ప శ్రీహ‌రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు డిసిపి జోగుల న‌ర్స‌య్య‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఏసిపి యాద‌గిరి, సంఘం ఉపాధ్య‌క్షుడు శివ‌ర‌త్నం, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు చంద్ర ప్ర‌కాష్‌, ఓం ప్ర‌కాష్‌, డైరి క‌మిటీ క‌న్వీన‌ర్ మ‌ల్లేష్‌, రాంచంద‌ర్‌, రాష్ట్ర యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు అంబ‌టి మ‌ల్ల‌య్య సుధాక‌ర్‌, స‌త్య‌నారాయ‌ణ‌, బాల‌య్య‌, న‌గ‌ర గంగ‌పుత్ర సంఘం అధ్య‌క్షుడు చాట్ల స‌దానంద్‌, భ‌గ‌వాన్‌, మాధ‌వీ ల‌త‌, స్వ‌ర్ణ‌ల‌త‌, సంగీత‌, సునీత త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page