...

పాపన్నగౌడ్ సామాజిక న్యాయం పునాదితోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది

పాపన్నగౌడ్ సామాజిక న్యాయం పునాదితోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది
» టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

బంజారాహిల్స్, ఆగ‌స్టు 16, ( అద్దం న్యూస్ ) :   సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆలోచన అయిన సామాజిక న్యాయం పునాదితోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని అన్నారు. ఆదివారం హైద‌రాబాద్ బంజారాహిల్స్ ఎన్‌టిఆర్ భవన్‌లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 వ‌ జయంతి కార్యక్రమాన్ని తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సురగోని గజేంద్రగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… తన కుల వృత్తిని చేసుకుంటూనే రాజ్యాధికారం గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి పాపన్నగౌడ్ అని అన్నారు. ఇది బహుజనులకు మార్గదర్శకమని అన్నారు. పాపన్నగౌడ్‌కు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధముందని అన్నారు. పాపన్నగౌడ్ తెలంగాణలో పుట్టాడు… తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే పుట్టిందన్నారు. పటేల్.. పట్వారీ వ్యవస్థ వల్ల, దొరల వల్ల తెలంగాణ ప్రాంతంలో బహుజనులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మన పెద్దలు మనకు చెప్పేవారన్నారు. బహుజనులకు ఇబ్బంది పెట్టిన పటేల్.. పట్వారీ వ్యవస్థను ఎన్‌టిఆర్ రద్దు చేసి నిజమైన స్వాతంత్య్రాన్ని ఇచ్చారని అన్నారు. పాపన్నగౌడ్ గోల్కొండను 7 నెలలు పాలించడం చిన్న విషయం కాదన్నారు. ఉద్యమ సమయంలో ద‌ళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక తానే ముఖ్యమంత్రి అయ్యారని విమ‌ర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. ఇటీవల కొత్తగా పార్టీ పెట్టినామె కూడా నేను ముఖ్యమంత్రినై మీకు మంచి చేస్తానని చెబుతున్నదని, మన బహుజనులకు మేలు చేసిన ఎన్‌టిఆర్ విగ్రహాలను మాత్రం పార్శిల్ చేసి పంపిస్తానని అంటున్నారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో తెలంగాణ బిడ్డలే ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల వారే ముందుంటారని అన్నారు. ప్రతి బహుజనుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. భవిష్యత్‌లో అందరం కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకుందామని అన్నారు. భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా మనం సత్తా చాటాల్సిన అవసరముందన్నారు. కల్లుగీత కార్మికులకు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాల్సిన అవసరముందని, కల్లుగీత కార్మికులకు బకాయి ఉన్న రూ.20 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు కొయ్యాడ స్వామి గౌడ్ మాట్లాడుతూ… పాపన్న గౌడ్ జయంతిని ఇతర ఏ పార్టీ చేయని రోజు అధికారికంగా 13 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ ఎన్‌టిఆర్ భవన్‌లో జరపడం జరిగిందన్నారు. ఎన్‌టిఆర్ భవన్‌లో పాపన్నగౌడ్ జయంతిని జరపడం ప్రారంభించిన తరువాతనే ఇతర పార్టీల వారు ఒక్కొక్కరుగా పాపన్నగౌడ్ జయంతిని చేయడం ప్రారంభించారని తెలిపారు. సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లభించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 560 జీఓను తీసుకురావడం జరిగిందని తెలిపారు. తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సురగోని గజేంద్ర గౌడ్ మాట్లాడుతూ… బహుజనులకు అన్యాయం చేస్తున్న మొగలాయిలపై పోరాటం చేయడానికి పాపన్నగౌడ్ మొదట అన్ని కులాల నుంచి 12 మందిని సైన్యంగా తయారు చేసుకుని వీరిని 12 వేల మందికి పెంచుకుని 32 కోటలకు తన రాజ్యాన్ని విస్తరింపజేశారన్నారు. గౌడ్‌ల పోరాటాల వల్ల పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా మనమందరం కృషి చేద్దామ‌న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు రాజు నాయక్, జివిజి నాయుడు, వెంకట్రాజం గౌడ్, వల్లారపు శ్రీనివాస్, సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాలరాజ్‌గౌడ్, నక్కా కృష్ణగౌడ్, వెంకటేష్‌గౌడ్, లోకేష్ గౌడ్, మహేష్ యాదవ్, రాంబాబు, జగదీష్‌గౌడ్, లచ్చగౌడ్, అశోక్‌గౌడ్, సుహాసిని, చంద్ర‌మోహ‌న్ గౌడ్‌, ముర‌ళీ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.