...

సికింద్రాబాద్ పేరును తొల‌గిస్తే పెద్ద ఎత్తున ఉద్య‌మం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ పేరును తొల‌గిస్తే పెద్ద ఎత్తున ఉద్య‌మం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, జనవరి 14, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ పేరును తొల‌గిస్తే పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌డుతామ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ బచావో నినాదంతో ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధ‌వారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సుదీర్ఘ చరిత్ర, విశిష్ట గుర్తింపు కలిగిన సికింద్రాబాద్ పేరును మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మార్చే యత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చేపడుతున్న ఈ చర్యలు దుర్మార్గమైనవని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే పేర్ల మార్పు పేరిట కొత్త డ్రామాకు తెరలేపుతోందని ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహించనున్న ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, న్యాయపరంగా కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామని నేతలు హెచ్చరించారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఒకే కలెక్టర్ ఉండగా, వేర్వేరు ఆర్డీఓలు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, పరిపాలనా సౌలభ్యం పేరిట సికింద్రాబాద్ గుర్తింపును దెబ్బతీయడం సరికాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, పేర్లు మార్చడమే ప్రధాన కార్యాచరణగా మారిందని విమర్శించారు. హైదరాబాద్‌కు ప్రధాన రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషనేనని, దానిని మల్కాజ్‌గిరి పరిధిలోకి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 150 డివిజన్లను 300కు పెంచి హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ పేర్లతో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పేరుతో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు అహింసా మార్గంలో దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. అలాగే 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, పాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం స్టేషన్ ముట్టడి చేస్తామని వెల్లడించారు. అవసరమైతే బంద్‌లు, ధర్నాలు నిర్వహించి, ప్రభుత్వం స్పందించకపోతే సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒకవైపు సాధ్యం కాదని చెబుతూనే, మరోవైపు ప్రాంతాల మార్పులు చేయడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, పవన్ గౌడ్, బీఆర్ఎస్ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, ఆకుల అరుణ్‌కుమార్‌, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.