యుఎస్‌పిసి, జాక్టో నేతలకు విముక్తి – గత ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేసిన న్యాయస్థానం

 

యుఎస్‌పిసి, జాక్టో నేతలకు విముక్తి.

గత ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేసిన న్యాయస్థానం

 

హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ :    2020 డిసెంబర్ 29వ తేదీన జ‌రిగిన‌ మహాధర్నా సందర్భంగా గత ప్రభుత్వం పెట్టిన కేసును గురువారం సికింద్రాబాద్‌ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ఉపాధ్యాయ సంఘాల నాయకులు చావ రవి, టి.లింగారెడ్డి, జి.సదానందం గౌడ్ లను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ఎస్టియు ప్రధాన కార్యదర్శి జి సదానందం గౌడ్, డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి లు మాట్లాడుతూ… ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ( యుఎస్‌పిసి ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) సంయుక్త ఆధ్వర్యంలో పిఆర్సీ, బదిలీలు, ప్రమోషన్ల సాధన కోసం 2020 డిసెంబర్ 29 న ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో మహా ధర్నా నిర్వహించామ‌న్నారు. ఆ సందర్భంగా పోలీసులు అనుమతించిన సంఖ్యకంటే అదనంగా ఉపాధ్యాయులను సమీకరించారని, కోవిడ్ ప్రోటోకాల్స్ అతిక్రమించారని ఆరోపిస్తూ యుఎస్‌పిసి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, టి.లింగారెడ్డి, జాక్టో చైర్మన్ జి సదానందం గౌడ్ ల పై గాంధీనగర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ నెం. 421/2020 నమోదు చేసి, ఐపిసి సెక్షన్లు 269, 290, 341 r/w 34, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 21/76 క్రింద 2021 ఏప్రిల్ 1 న సికిందరాబాద్ సిటీ కోర్టులో కేసు రిజిస్టర్ చేశార‌ని తెలిపారు. 2021 జులై 22న తొలి హియరింగ్ తో ప్రారంభమైన విచారణ 39 వాయిదాలతో కొనసాగి 2024 ఏప్రిల్ 22 న విచారణ ముగిసిందని వివ‌రించారు. ధర్నా కారణంగా ఆ ప్రాంతంలో అసౌకర్యం కలిగినట్లు పబ్లిక్ నుండి ఎలాంటి పిర్యాదు లేదని… ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని…శాంతి భద్రతలకు భంగం కలగలేదని.. అయినా తప్పుడు సాక్ష్యాలతో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు. ఉపాధ్యాయ నాయకుల పక్షాన న్యాయవాదులు జివిఎల్ మూర్తి, ఎం.స్రవంతి సమర్థవంతంగా వాదనలు వినిపించార‌ని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ సిటీ సివిల్ కోర్టు 19 వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎం.అరుణ గురువారం తీర్పు వెలువరించార‌ని… ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి పెద్ద విజయం లభించిందన్నారు. గత పాలకుల కక్ష సాధింపు చర్యలకు చెంపపెట్టుగా ఈ తీర్పు నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ నేప‌ధ్యంలో సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు వ‌ద్ద‌కు న్యాయస్థానం తీర్పు కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎ వెంకట్ (టిఎస్ యుటిఎఫ్ ), సిహెచ్ అనిల్ కుమార్ ( టిపిటిఎఫ్ ), కె కృష్ణుడు ( బిసిటిఎ ), బి.కొండయ్య , ఎస్.మహేష్ ( ఎంఎస్‌టిఎఫ్ ), బి సురేంద్ర, సింహాచలం, ఇప్తకార్ అహ్మద్, పోల్ రెడ్డి, రాజారావు, యాదయ్య, సైదులు, యాదగిరి, జయసింహారెడ్డి, నీరజ, జగన్నాథ శర్మ, రఘుపాల్ ఇంకా పలువురు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే కేసు నుండి విముక్తి పొందిన నాయకులను అభినందించారు. న్యాయవాది స్రవంతి కి ధన్యవాదాలు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page