...

మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం – సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం
– సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం నుంచి కాపాడి భవిష్యత్తరాలకు అత్యద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట – మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ నిర్వహించి గోశాలను ప్రారంభించారు. శ్రీ మచిలేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. 1400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని 8 ఎకరాల్లో దాదాపు 700 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… మూసీ ప్రక్షాళన చేయడమన్నది ఇప్పుడు నిత్యావసర వస్తువులకన్నా అత్యవసరమ‌న్నారు. పరీవాహక ప్రాంతాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా, ప్రత్యేకమైన ధ్యాన మందిరాలతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నాని తెలిపారు.

అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని, ఇది మా దీక్ష. మూసీ నది ప్రక్షాళనతో పాటు దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మిస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. రామప్ప ఆలయ నమూనాను ఇక్కడ నిర్మించాలని సంకల్పించామ‌ని పేర్కొన్నారు. ఇది యథాలాపంగా చేస్తున్నది కాదని.. దైవేచ్ఛతో సాగుతున్న కార్యక్రమంగా భావిస్తున్నామ‌ని.. అందరూ ఆశీర్వదించి.. సహకరించాలన్నారు. చరిత్రను గమనించినప్పుడు నదీ పరీవాహన ప్రాంతాలు, సముద్ర తీరాల్లోని ప్రాంతాలు అభివృద్ధిని సాధించాయన్నారు. తెలంగాణ సముద్రతీరం లేని రాష్ట్రం అని, రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఈసా నదులున్నా ఆ జలాలను సరిగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయాయని అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంతో జనజీవనం స్తంభించిపోయిందని, రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఉండే ఢిల్లీలో యమునా నది కాలుష్యమై పారుతోందన్నారు. కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించడం, పెట్టుబడులు తరలిపోవడం వంటి పరిస్థితుల నుంచి మనం నేర్చుకోవలసిన అవసరం ఉందా లేదా అని అన్నారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక అని అన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన చార్మినార్ మక్కా మసీదు ప్రాంతంలో అద్భుతమైన మసీదును, గౌలిగూడ ప్రాంతంలో సిక్కు చరిత్ర ఉందని, స్వర్ణ దేవాలయంలాంటి దేవాలయం నిర్మాణం, ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి నిర్మించబోతున్నామ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. వర్షాకాలంలోనే కాకుండా నిరంతర నీటి ప్రవాహం, నగర ప్రజల తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చడానికి గోదావరి నుంచి 20 టీఎంసీలను తరలిస్తున్నామ‌న్నారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజా ప్రతినిధులందరూ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని కోరుతున్నారన్నారు. ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మంత్రివర్గ సహచరుల సహకారంతో ముందుకు వెళుతున్నామ‌ని తెలిపారు.

ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారని.. ప్రాంత ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఎంఆర్‌డిసిఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.