తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సస్పెండ్ చేస్తారా ? అని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి అక్రమంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు కెటిఆర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలను అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీది పేరు గోప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పేరుకేమో ప్రజాపాలన చేసేదేమో అప్రజస్వామిక పనులు అని అన్నారు. రైతాంగ తరపున, ఆడబిడ్డల తరుపున, ఆరు గ్యారెంటీల అమలు గురించి, రాష్ట్రంలోనిపేద వారి తరపున, పెంచని పెన్షన్ల గురించి 420 హామీల గురించి జగదీష్‌రెడ్డి ప్రశ్నిస్తే తట్టుకోలేక కుయుక్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా, నియంతృత్వ పోకడలతో జగదీష్‌రెడ్డిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. జగదీష్‌రెడ్డి సస్పెండ్ పై నిరసన తెలియచేసేందుకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తే గేట్లు మూసేసి ఆ మహానుభావుడిని సంకెళ్లతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, వివేకానంద, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పథకం ప్రకారమే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం : ఎమ్మెల్యే హరీష్‌రావు
పథకం ప్రకారమే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఉంటే కాంగ్రెస్ తప్పులు బయటపడుతాయని ఉద్దేశపూర్వకంగా జగదీష్‌రెడ్డిని సస్పెండ్ చేశారన్నాని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి దళితుల ఖ్యాతిని పెంచిందన్నారు. రాష్ట్ర సచివాలాయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళితుల గౌరవాన్ని పెంచింది కెసిఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పేరుతో దళితులకు ఒక్కొక్కరికి పది లక్షలను అందచేసిందని కెసిఆర్ ప్రభుత్వమన్నారు. దళితులను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. దళిత్ కార్డ్ అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తొందన్నారు. బిఆర్.అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. బాబూ జగ్జీవన్ రామ్‌ను అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకున్న సంగతి దేశ ప్రజలకు తెలుసునన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోనియాగాంధీ అవమానపరిచిన చరిత్ర ప్రజలు మరిచిపోలేరన్నారు.

