దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
– టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ అరవింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 3, అద్దం న్యూస్ : కోర్టు నిర్దేశించిన విధంగా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ( ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ) లో ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వర్యంలో ‘దివ్యాంగుల దినోత్సవం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ అరవింద్ కుమార్ గౌడ్, టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ సిలువేరు కాశీనాథం హాజరయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా అరవింద్‌కుమార్ గౌడ్ చేతుల మీదుగా దివ్యాంగులకు దుప్పట్లను పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులైన పివి,రావు, రామచందర్, మంగమ్మ, షణ్ముఖ రావు లకు శాలువా కప్పి సన్మానం చేసారు.
అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… దివ్యాంగుల సాధికారతకు చట్టాలు, పాలనలో సంస్కరణలు అవసరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 470 బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే పూరించాలన్నారు. ఇది దివ్యాంగుల హక్కు అని అన్నారు. భవనాలలో సౌలభ్యం కేంద్రం ప్రవేశపెట్టిన పిడబ్ల్యుడి చట్టం ( పీపుల్స్ విత్ డిజేబులిటీస్ ) ప్రకారం ప్రభుత్వ భవనాలలో దివ్యాంగులకు ప్రత్యేక యాక్సెస్ ( ర్యాంపులు, ప్రత్యేకతలు ) ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖకు సంబంధించిన ఏడీ ( అసిస్టెంట్ డైరెక్టర్ ) కార్యాలయాలను జిల్లాల స్థాయిలో తగిన సిబ్బందితో వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. దీంతో గ్రామీణ ప్రాంత దివ్యాంగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగుతుందన్నారు.
టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ సిలువేరు కాశీనాథం మాట్లాడుతూ… దివ్యాంగుల హక్కులు, వారికి మెరుగైన జీవనం అందించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగుల ఆర్థిక స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల వరకు వ్యక్తిగత పూచీకత్తుతో రుణాలు మంజూరు చేయాలన్నారు. నూతన సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలలో చదువుకున్న దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.
సాయిబాబా మాట్లాడుతూ… దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించాలని, వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవితం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఉద్ఘాటించారు. పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్నట్లుగానే, దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతమున్న రూ.4,000 నుండి రూ.6,000 లకు వెంటనే పెంచాలన్నారు. మహిళలకు ఇస్తున్నట్లు, ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం ( ఉచిత బస్ పాస్ ) కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. దివ్యాంగుల సౌలభ్యం కోసం మోటార్ వెహికల్స్ ( మోటార్ సైకిళ్లు, ట్రై సైకిళ్లు ) ను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు బాలరాజు గౌడ్, అజ్మీరా నాజునాయక్, ఎస్.ప్రకాష్, నాగునగేష్, ఎబిఆర్ మోహన్, రవీంద్రాచారి ప్రమీల, ఝాన్సీ, రాజశేఖర్, జోగింధర్, నర్సింగ్, బిఎ.నాయుడు, బివైశ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply