జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ భారీ చోరి –  48 గంటల్లో చోరీ కేసును ఛేదించిన‌ చిక్కడపల్లి పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు

జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ భారీ చోరి
48 గంటల్లో చోరీ కేసును ఛేదించిన‌ చిక్కడపల్లి పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
నిందితుల‌ నుంచి 25.8 తులాల బంగారు నగలు, 23 వేల నగదు స్వాధీనం

హైదరాబాద్, ఆగ‌స్టు 17, అద్దం న్యూస్ :    కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి పాల్పడిన ఇద్దరు నిందితులను చిక్కడపల్లి పోలీసులు 48 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్ర‌ల్ జోన్ అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్‌, చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌మేష్‌, చిక్క‌డ‌ప‌ల్లి ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్‌ల‌తో క‌లిసి సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. హైద‌రాబాద్ చిక్కడపల్లిలో నివాసముంటున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో ఈ నెల 15 వ తేదీన భారీ చోరి జ‌రిగింది. రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లోంచి దాదాపు 30 తులాల బంగారం 23 వేల నగదును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌స్క‌రించి పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని క్రైమ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు.

నిందితులు కర్ణాటక హుబ్లీకి చెందిన డార్ల నేహా మియా అలియాస్ బ్రూస్లీ కొంపల్లిలో నివాసం ఉంటున్నాడు. గ‌తంలో నేరం చేసి జైలుకు వెళ్లాడు. జైలులోనే ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రాయిడు చైతన్య అలియాస్ సాయికుమార్ తో బ్రూస్లీకి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ ఇద్దరిలో ప్రధాన నిందితుడు అయినటువంటి బ్రూస్లీ ఓ చోరీ కేసులో చర్లపల్లి జైల్లో నిందితుడిగా ఉండి బెయిల్ పై ఈనెల 13వ తేదీన విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన 24 గంటల లోపే చిక్కడపల్లిలో భారీ చోరీకి పాల్పడ్డాడు. 25.8 తులాల బంగారు నగలు, 23 వేల నగదును దొంగిలించాడు. అయితే జైలులో ఉన్న‌ప్పుడే సాయికుమార్ నిందితుడు బ్రూస్‌లి కి బెయిల్ కోసం కొంత మొత్తం డబ్బు సమకూర్చాడు. తాజాగా దొంగ‌త‌నం చేసిన త‌ర్వాత త‌న బెయిల్ కోసం ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయడానికి బ్రూస్‌లి బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కలవాల్సిందిగా సాయి కుమార్ ను కోరగా అతను వ‌చ్చాడు. సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం వ‌ద్ద ఇద్దరు కలుసుకొని బెయిల్ కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేందుకుగాను తాను దొంగలించిన సొత్తు నుంచి కొన్ని బంగారు ఆభరణాలు సాయికుమార్ కి బ్రూస్లి ఇచ్చాడు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం వ‌ద్ద అనుమానాస్ప‌దంగా క‌నిపించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు.

నిందితుల వద్ద నుంచి 25.8 తులాల బంగారు ఆభరణాలు 23 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గతంలో హైదరాబాద్, రాచకొండ సైబరాబాద్, తెలంగాణలో బ్రూస్లీపై 60 కిపైగా కేసులు ఉన్నాయి. పాల్వంచకు చెందిన సాయి కుమార్ పై కూడా బైక్ దొంగతనంతో పాటు హౌస్ బ్రేకింగ్ వంటి 60 కేసులు ఉన్నాయి. నిందితులపై గతంలోనే పీడి యాక్ట్ నమోదయిందని తెలిపారు. 48 గంటల్లోనే నిందితులను పట్టుకొని కేసులు ఛేదించిన‌ పోలీసులను డిసిపి శిల్పవల్లి అభినందించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తమ బంగారు ఆభరణాలను భద్రపరచుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page