నామినేటెడ్ పోస్టులు అన్ని అగ్రవర్ణాలకేనా ?
♦ సమాచార కమిషనర్ నియామకంలో ఒక్కటీ బీసీలకు ఇవ్వరా…
♦ రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదా ?
♦ బీసీలపై చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీలో చూపించండి
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్
కాచిగూడ, మే 21, అద్దం న్యూస్ : రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంలో సామాజిక న్యాయం పూర్తిగా కొరవడిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బీసీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా, అగ్రకులాలకే సమాచార కమిషనర్ పదవులను కట్టబెట్టిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో జరిగిన కులగణన లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ, నామినేటెడ్ పోస్టుల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 10 సమాచార కమిషనర్ పదవుల్లో ఇప్పటి వరకు ప్రకటించిన 7 పదవుల్లో ఒక్క బీసీ అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ద్వారా బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలంగాణలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారని, రాష్ట్ర జనాభాలో 56 శాతం వాటా బీసీలు ఉన్నా సమాచార కమిషనర్ పదవుల భర్తీలో బీసీలను పూర్తిగా పక్కనపెట్టడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. సమాచార కమిషనర్ పదవులకు కావాల్సిన అన్ని అర్హతలు బీసీ అభ్యర్థులకు ఉన్నప్పటికీ, నియామకాల్లో వారిని పట్టించుకోకపోవడం దారుణమని గుజ్జ సత్యం అన్నారు.
తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఖాళీగా ఉన్న మిగిలిన మూడు సమాచార కమిషనర్ పదవులను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జనాభా ప్రకారం 56 శాతం పదవులు బీసీలకు కేటాయించాలని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ లను అమలు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు కేవలం 15% మాత్రమే ప్రాతినిధ్యం లభించిందని, ఇది రాష్ట్ర జనాభా నిష్పత్తితో పోలిస్తే చాలా తక్కువని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తామని పదే పదే హామీలు ఇస్తున్నప్పటికీ, చీఫ్ సెక్రటరీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సమాచార కమిషనర్లు వంటి నామినేటెడ్ పదవులన్నీ అగ్రకుల సామాజిక వర్గాలకు కట్టబెట్టడం బీసీలలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల విశ్వాసం చూరగొనాలంటే, కులగణన ఆధారంగా 56 శాతం లేదా కనీసం 42 శాతం పదవులు బీసీలకు కేటాయించాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దకపోతే, బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాయని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా ఇంచార్జ్ సూర్యనారాయణ, బీసీ నేతలు జానయ్య, జెల్ల నరేందర్, భద్ర , తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply