రాంనగర్, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) : ఇటీవల జపాన్ లో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చేరీ మహిళల జట్టు, మిక్స్డ్ జట్టు విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన యువ ఆర్చర్ క్రీడాకారిణి “ తనిపర్తి చికిత ” ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ రాంనగర్లోని ఆయన నివాసంలో తనిపర్తి చికిత కు శాలువాలు కప్పి, స్వీటు తినిపించి సత్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… తెలంగాణలోని ఎలిగేడు మండలం, సుల్తానాపూర్ గ్రామానికి చెందిన తనిపర్తి చికిత ఒక సామాన్య రైతు కుటుంబం నుండి ఎదిగి, 2026 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలను సాధించి, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్కు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ కోటాను సాధించడం మన భారతీయులందరికీ గర్వకారణమన్నారు. 2025 లో స్వర్ణ పతకాన్ని సాధించి, మళ్లీ 2026 ఆసియా క్రీడల పోటీలో మళ్ళీ రెండు స్వర్ణ పతకాలను సాధించడం ఆమెకు విలువిద్యలో ఉన్నటువంటి నైపుణ్యం, పట్టుదల చాలా గొప్పదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. విలు విద్య భారతీయ సంస్కృతిలో చాలా ప్రాచీనమైన గొప్ప విద్య అని, అలాంటి విద్యలో స్వర్ణ పతకాలు సాధించిన తనిపర్తి చికిత తెలంగాణ బిడ్డ కావడం చాలా గర్వకారణమని అభినందించారు. భారత కీర్తి పతాకాన్ని ప్రపంచంలో రెపరెపలాడించినందుకు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలియజేసారు.
స్వర్ణ పతకాలు సాధించిన యువ ఆర్చర్ క్రీడాకారిణి “ తనిపర్తి చికిత ” ను సన్మానించిన బండారు దత్తాత్రేయ
RELATED ARTICLES
