ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల కూటమి భారీ విజయం
– ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి ఆధిక్యం.. బస్భవన్లో భారీ సంబరాలు
హైదరాబాద్, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ ఆర్టీసీ ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల కూటమి ఆధిక్యంలో నిలిచింది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్మిక సంఘాలు పోటీ పడ్డాయి. మొత్తం 34,905 మంది ఉద్యోగులకు గాను 34,182 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో సుమారు 98 శాతం పోలింగ్ నమోదైంది. ప్రాథమిక లెక్కింపు ప్రకారం ఈయూ కూటమి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 డిపోల్లో 23 చోట్ల ఈయూ కూటమి ఆధిక్యం సాధించగా, మూడు డిపోల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ ( టీడబ్ల్యూయూ ) ముందంజలో నిలిచింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని బస్భవన్ వద్ద ఈయూ కూటమి మద్దతుదారులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, టిఎంయు ప్రధాన కార్యదర్శి ఎం.థామస్ రెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి.మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్మికుల మద్దతుతో కూటమి ఆధిక్యంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పెండింగ్ బకాయిల చెల్లింపు, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 17న తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆర్టీసి కార్మికులకు రావాల్సిన హక్కులను, డిమాండ్ల సాధన కోసం కూటమి పని చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూటమి నాయకులతో చర్చించి ఆర్టీసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
