గవర్నర్ తో భేటీ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
– కెసిఆర్ ఇంటి పై కాంగ్రెస్ నాయకుల దాడి
– బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిల పై పోలీసులు దాడి
– మహిళా ఎమ్మెల్యేల పై అనుచిత ప్రవర్తన తదితర అంశాలపై గవర్నర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన నేతలు
తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 9, ( అద్దం న్యూస్ ) : లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బుధవారం భేటీ అయ్యారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దాడి చేసి, ఆయన నివాసాన్ని ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ చేసిన కుట్ర.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు చేసిన దాడి.. అక్రమ కేసులు, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు.. మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత ప్రవర్తన తదితర అంశాలలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనలో ప్రజలకు అన్యాయమే జరిగిందని నల్ల టీ-షర్టులు ధరించి నిరసన తెలుపుతుంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు వినతి పత్రాన్ని అందచేశారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో కెటిఆర్ మాట్లాడుతూ… మహిళా ఎమ్మెల్యేల పట్ల దారుణంగా ప్రవర్తించి.. దుశ్శాసన పర్వానికి కాంగ్రెస్ తెరలేపిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మొన్న శాసనసభ సమావేశాల మొదటి రోజు మా మీద కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన దాష్టీకాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపిన తీరులోనే, టీ-షర్ట్ల ద్వారా నిరసన తెలపాలని మేము భావించామని, మా హక్కులను కాలరాస్తూ, శాసనసభ్యులమైన మమ్మల్ని సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును గవర్నర్ కు వివరించామని తెలిపారు. మాపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని ఫోటోలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కెటిఆర్ పేర్కొన్నారు.
మా మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగి, దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును వివరించామన్నారు. మా పార్టీ నాయకులతో పాటు అందరిపైనా దాడి చేయడానికి వెళ్లిన పోలీసులపై ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోని తీరును గవర్నర్ కు తెలియజేశామన్నారు. చివరికి కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిన తీరును వివరించామన్నారు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లిన విషయాన్ని కూడా గవర్నర్ కు తెలియచేశామన్నారు. తెలంగాణలో న్యాయం జరగకుంటే, జాతీయ స్థాయిలో జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామున్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా శాసనమండలి, శాసనసభలోకి మమ్మల్ని రాకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరును వివరించామన్నారు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపై ఎలాంటి గౌరవం లేదని గవర్నర్ కు తెలియజేశామన్నారు.![]()













Leave a Reply