హైదరాబాద్, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) : భారత ఎన్నికల సంఘం సంస్థాగత స్వతంత్రతను కాపాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ ( సీఈసీ ) జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్, సీపీఐ ( ఎం ) నాయకులు ఎం.వెంకటేష్, మహేందర్, కాంగ్రెస్ కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ హలీం హజ్రీ, టీజేఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ముజాహిద్, టీజేఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్, సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి స్టాలిన్, వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్, టీజేఎస్ పార్టీ నాయకుడు సలీం పాషా, టీపీసీసీ కార్యదర్శి రషీద్ ఖాన్, కాంగ్రెస్ నాయకుడు సంతోష్ గుప్తా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె.హరిధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను ఓటు హక్కుకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగిపోయాయని పేర్కొన్నారు. కొత్త ఓటు దరఖాస్తులో తీసుకొచ్చిన నిబంధనలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం కల్పించాలని కోరారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈనెల 8న లోక్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు వెల్లడించారు. అనంతరం ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్పై పోరాటం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసమేనని, తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే సీఈసీ పనిచేస్తున్నారని వారు ఆరోపించారు.
