...

ముఖ్యమంత్రి జల్సాలు ఫుల్ – తెలంగాణ ఖజానా ఖాళీ ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

ముఖ్యమంత్రి జల్సాలు ఫుల్ – తెలంగాణ ఖజానా ఖాళీ !
– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 8, అద్దం న్యూస్ :     తెలంగాణ ముఖ్యమంత్రి, ఒకవైపు ” నన్ను కోసుకుని తిన్నా పైసా లేదు ” అంటూ రాష్ట్ర ఖజానా ఖాళీ అని పేద మాటలు చెబుతూనే, మరోవైపు తన వ్యక్తిగత సౌకర్యాలు, జల్సాల కోసం ప్రజాధనాన్ని ” నేనే అంబానీ ” అన్న రేంజ్‌లో కోట్ల రూపాయ‌ల‌ దుర్వినియోగం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరాచక వైఖరికి ప్రభుత్వ ఖజానా బలైపోతోంది, ప్రజల సొమ్ము మంచినీళ్లలా వృధా అవుతోందని అన్నారు. ముఖ్యమంత్రి తన సరదాల కోసం రూ.5 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని.. తన ఇంటి దగ్గర ఉన్న ఎంసిహెచ్ఆర్‌డి క్యాంపస్‌ను తన క్యాంప్ ఆఫీసుగా మార్చుకున్న ముఖ్యమంత్రి, అక్కడే తన సన్నిహితులు, మిత్రులతో ఆడుకోవడానికి భారీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేయించారన్నారు.

                      గత ఏడాది కాలంగా ఫుట్‌బాల్ గ్రౌండ్‌తో పాటు మరో రూ.5 కోట్లు ఖర్చు చేసి హెలిపాడ్‌ను కూడా నిర్మించుకున్నారన్నారు. అంటే, కేవలం జల్సాల కోసం రూ.10 కోట్లకు పైగా ప్రజాధనం వృథా చేసారని, ఫుట్‌బాల్ గ్రౌండ్ ముఖ్యమంత్రికి ఒక లెక్క కాదని ప్రభుత్వవర్గాలే చర్చించుకోవడం ప్రభుత్వ దుబారాకు నిదర్శనమ‌న్నారు. ఢిల్లీ పర్యటనకు లక్షల్లో ఖర్చు చేసారని.. ఇటీవ‌ల కేవలం 10 నిమిషాల ఢిల్లీ పర్యటనకు ప్రత్యేక విమానం కోసం రూ.90 లక్షలు ఖర్చు చేయడం, ఢిల్లీ పర్యటనల పేరుతో ఇప్పటికే లక్షల్లో దుబారా చేయడం చూస్తే, తన సౌకర్యాల కోసం కోట్లల్లో ఖర్చు చేస్తూ, ప్రజలకు మాత్రం ఖజానా ఖాళీ అని మాయమాటలు చెప్పడం ముఖ్యమంత్రికి తగదన్నారు. ప్రభుత్వం తమ జల్సాలలో మునిగి తేలుతూ, రాష్ట్ర ప్రజల కీలక సమస్యలను గాలికి వదిలేసిందని, గురుకులాలలో పదుల సంఖ్యలో పిల్లలు జబ్బుపడి చనిపోతున్నా పట్టించుకోని వైఫల్యం కారణంగా గురుకులాలు కాంగ్రెస్ పాలనలో ‘ యమకులాలుగా ‘ మారాయని వాపోయారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ అందక వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారిందని, ఐదు, ఆరు నెలలుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒప్పంద ( కాంట్రాక్టు ) కార్మికులకు, ఉద్యోగులకు జీత భత్యాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ధ్వ‌జ‌మెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తే, దాన్ని చూసి ” పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ” కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం లేని వాతలు పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ధర్మం కాదని సాయిబాబా విమర్శించారు.

                   కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్లాక్‌మెయిల్ ధోరణిని అవలంబిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, మేము ఓడిపోతే సంక్షేమ కార్యక్రమాలను కట్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేసి భయపెట్టి అన్నిచోట్ల ఏకగ్రీవాలు చేస్తున్నారన్నారు. సుమారు 1000 చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో విచ్చలవిడిగా వేలం పాటలు నడుస్తూ ఏకగ్రీవాలు అవుతున్నా,           రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఈ సమస్యను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల సమస్యలను విస్మరిస్తూ పని చేస్తుండడాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని సాయిబాబా కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.