కాలేజీ, హాస్ట‌ళ్ల వ‌ర్క‌ర్ల‌కు నెల నెల జీతాలు చెల్లించాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య

 

కాలేజీ, హాస్ట‌ళ్ల వ‌ర్క‌ర్ల‌కు నెల నెల జీతాలు చెల్లించాలి

♦ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :    కాలేజీ, హాస్ట‌ళ్ల వ‌ర్క‌ర్ల‌కు నెల నెల జీతాలు చెల్లించాలని, లేని ప‌క్షంలో క‌మిష‌న‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డిస్తామ‌ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లోని బిసి భ‌వ‌న్‌లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బిసి కాలేజీ హాస్ట‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కుల‌తో ఆర్‌.కృష్ణ‌య్య స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ… కాలేజీ హాస్ట‌ళ్ల‌ల్లో ప‌ని చేస్తున్న వ‌ర్క‌ర్ల‌కు నెల నెల జీతాలు రాక చాలా ఇబ్బందులుప‌డుతున్నార‌న్నారు. ఇప్ప‌టికే కొన్ని జిల్లాల్లో 10 నెల‌ల గ‌డిచినా జీతాలు రావ‌డంలేద‌న్నారు. హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లందరికి నెల నెల జీతాలు ఇవ్వక‌పోవ‌డంతో వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయన్నారు. గత సంవత్సర కాలం నుండి రోజు వారి ఖర్చులకు సరిపడే డబ్బులను బయట నుండి అప్పుగా మిత్తితో తీసుకొచ్చి అతి కష్టం మీద బ్రతుకుతున్నారన్నారు. వర్కర్ల జీతాలు 15000 నుండి 25000 లకు పెంచాల‌ని, బయట లేబర్ అడ్డాలతో రోజు వారి కూలి రూ.700 లు ఇస్తున్నార‌ని తెలిపారు. గ్రామాలలో వ్యవసాయ కూలీలకు రోజుకు 700 – 800 రూపాయ‌ల వ‌ర‌కు ఇస్తున్నార‌న్నారు. హాస్టళ్ళల్లో వ‌ర్క‌ర్లు ప్ర‌తి రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పని చేస్తున్నారని.. అంటే రోజుకు 14 గంటలు పనిచేస్తున్న వీరికి ఇచ్చే జీతం రోజు 500 రూపాయ‌లు మాత్రమే అని అన్నారు. వ్యవసాయ కూలీలు అడ్డ కూలీలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నారని.. అంటే రోజు 7 గంటల పని చేస్తూ 600 – 700 ఇస్తున్నారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ విధానం ఎత్తివేయాల‌ని, నేరుగా ప్రభుత్వం నుండి వర్కర్ల జీతాలు బ్యాంకు ఖాతాలలో జమచేయాలని డిమాండ్ చేశారు. బిసి హాస్టళ్ళలో వర్కర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించడం వలన ప‌ని భారం ఎక్కువగా ఉండటం వలన చాలా మండి వర్కర్లు ఇద్యోగం వదిలి వెళ్ళిపోతున్నారని తెలిపారు. దీంతో హాస్ట‌ల్ విద్యార్థులకు సమయానికి వంట చేసే వారు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రతి హాస్టల్‌కు నలుగురు శాశ్వత వర్కర్ల‌ను నియమిందాలని, అటెండరీ, వాచ్ మెన్, కనటి, కుక్ చొప్పున శాశ్వత ప్రతిపదికన నియమించాలన్నారు.

హాస్టల్లో 150 విద్యార్థుల కంటే ఎక్కువ సంఖ్య ఉన్నచోట ప్రతి 25 మందికి ఒక వర్కర్‌ను అద‌నంగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని, ప్రస్తుత 300 మంది విద్యార్థుల‌కు ముగ్గురు వర్కర్లు ఉన్నార‌ని పేర్కొన్నారు. పని భారంతో విద్యార్థులకు అసౌకర్యంగా ఉందని, విద్యార్థులు చదువు దెబ్బతింటుందన్నారు. ప్రతి హాస్టల్లలో కొత్త మెనూ ప్రకారం టిఫిన్‌లో ఇడ్లీ, వడ, పూరి, బోండా, చపాతి పెట్టడంతో వర్క్ లోడ్ ఎక్కువ కావడంతో నెల నెల జీతాలు రాకపోవడంలో హాస్టల్లలో పని చేయలేక వర్కర్స్ హాస్టల్ల నుండి వెళ్లిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు పెంచిన‌ మెనూ ప్రకారం పని చేయడానికి అదనంగా ఒక హాస్టల్‌కు 5 మంది వర్కర్ల‌ను ఇవ్వాల‌ని, అదే విధంగా హాస్టళ్ల‌లో వర్కర్ల‌ను పెంచిన తర్వాతనే మెనూను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలో నిరుద్యోగ జెఏసి క‌న్వీన‌ర్ నీల వెంక‌టేష్‌, విద్యార్థి సంఘం అధ్య‌క్షుడు జిల్ల‌ప‌ల్లి అంజి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కాలేజీ హాస్ట‌ల్ వ‌ర్క‌ర్ల సంఘం అధ్య‌క్షుడు ఎం.శేఖ‌ర్‌, సంఘం నాయ‌కులు బలరాం, త్రివేణి, అనిత, సునీత, బిసి నాయ‌కులు మల్లేష్ యాదవ్, రాజేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page