అనారోగ్యంతో చనిపోయిన గోమాత
ఆర్తనాదాలు చేసిన గోవులు
కన్నీరు పెట్టిన మిగిలిన ఆవులు
సాంప్రదాయ పద్దతిలో గోమాతకు అంత్యక్రియలు
♦ పార్శిగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు

చనిపోయిన లక్ష్మీ అనే గోవు ( ఫైల్ ఫొటో )
హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : మనుషులు చనిపోతే అంత్యక్రియలు చేయడం సర్వసాధారణం. ఈ మధ్యన పెంచుకున్న జంతువులకు కూడా అంత్యక్రియలు చేస్తున్నారు. కొంత మంది పెంచుకున్న ఆడ కుక్కలకు సీమంతాలు కూడా చేశారు. కానీ ఆవు చనిపోతే హిందూ సాంప్రదాయ పద్దతిలో ఆవుకు చీర కట్టి, బ్యాండ్ తో తీసుకెళ్లి స్మశాన వాటికలో పెద్ద గుంత తవ్వి అంత్యక్రియలు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… అడిక్‌మెట్ డివిజన్ బహదూర్‌నగర్ బస్తీకి చెందిన వెంకటేష్ యాదవ్ కుటుంబం గత 4 దశాబ్దాలకు పైగా అవులను పెంచుతూ పాలను విక్రయిస్తున్నారు. వారి వద్ద పదుల సంఖ్యలో ఆవులున్నాయి. వారి వద్ద 25 సంవత్సరాల వయస్సు ఉన్న లక్ష్మీ అనే పేరుతో ఆవు ఉంది. ఆ ఆవు ఇప్పటికి అనేక ఆవులకు, దూడలకు జన్మనిచ్చింది. అయితే లక్ష్మీ గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉంటుంది. వెంకటేష్ యాదవ్ గత కొన్ని రోజులుగా లక్ష్మీకి వైద్యం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం లక్ష్మీ చనిపోయింది.
సాంప్రదాయ పద్దతిలో గోమాతకు అంత్యక్రియలు :

స్మశాన వాటికలో తవ్విన గుంతలో లక్ష్మీకి సాంప్రదాయ పద్దతిలో పూజలు చేస్తున్న వెంకటేష్ యాదవ్
అనారోగ్యంతో చనిపోయిన లక్ష్మీ ( ఆవు ) కు హిందు సాంప్రదాయపద్దతిలో అంత్యక్రియలు జరిగాయి. ఆవుకు చీరను చుట్టి, ఒక మహిళకు ఎలాగైతే చేస్తారో అచ్చు అలాగే సాంప్రదాయపద్దతిలో ఈ గోమాతకు చేశారు. జెసిబి సహాయంతో డిసిఎం వాహనంలో పార్శిగుట్ట స్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఒక మనిషి చనిపోతే ఎలాగైతే బ్యాండ్ బాజాలతో అంతిమ యాత్రను నిర్వహిస్తారో అలాగే ఈ గోమాత అంతిమ యాత్రను నిర్వహించారు. బ్యాండ్‌బాజాలతో స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా తవ్విన గుంతలో లక్ష్మీ ( ఆవు ) ను బొంద పెట్టారు. అంతకుముందు ఆవుకు పూజలు నిర్వహించారు. తమతో ఇన్నేళ్లుగా ఉన్న ఆవును ఎక్కడో ఒక చోట పారవేయడం ఇష్టం లేక.. ఇలా అంత్యక్రియలు చేసామని వెంకటేష్ యాదవ్ అద్దం న్యూస్ ప్రతినిధితో తెలిపారు.
కన్నీరు పెట్టుకున్న గోవులు :

స్మశాన వాటికలో తవ్విన గుంతలో లక్ష్మీకి సాంప్రదాయ పద్దతిలో పూజలు చేస్తున్న వెంకటేష్ యాదవ్
లక్ష్మీ ( ఆవు ) చనిపోయిన దృశ్యాన్ని చూసిన మిగిలిన ఆవులు, దూడలు పెద్ద పెట్టున అరుస్తూ కన్నీరు పెట్టాయి. లక్ష్మీని తీసుకెళ్లే సమయంలో పదికి పైగా ఉన్న గోవులు, దూడలు అంబా… అంబా అంటూ అరిచాయి. తమతో ఇన్ని ఏళ్లుగా ఉంటున్న లక్ష్మీని తీసుకెళ్తుండగా మిగిలిన ఆవులు ఆర్తనాదాలు చేశాయి. గోవులు ఏడుస్తున్న దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఆ గోవులతో పాటు వాటిని పెంచుకునే ఇంటి కుటుంబసభ్యులు సైతం కన్నీరు పెట్టుకున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply