Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADఓటు హక్కును హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం –సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఓటు హక్కును హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం –సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

📰 Generate e-Paper Clip

సిఈసి జ్ఞానేశ్‌ కుమార్‌ను తక్షణమే తొలగించాలి
– జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతించాలి
– కరువు పరిస్థితులపై కేంద్రం స్పందించాలి
– ఆర్‌టిసి ఎన్నికల్లో ఎర్రజెండా సంఘాల విజయంపై అభినందనలు
» సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైద‌రాబాద్‌, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) :      కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో కొనసాగాలనే లక్ష్యంతో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య పునాదులనే దెబ్బతీస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్రం సమాధానం చెప్పాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైద‌రాబాద్ న‌గ‌రంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ఎఐటియుసి సీనియర్‌ నాయకులు విఎస్‌.బోస్‌, ఆర్‌టిసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాబు, కోశాధికారి ప్రసాద్‌రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఓటు హక్కును దెబ్బతీసే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. విదేశీయుల అక్రమ ప్రవేశాలను అడ్డుకోవాలనే పేరుతో ప్రారంభించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను దేశవ్యాప్తంగా విస్తరించి, అర్హులైన ఓటర్లను తొలగించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరినైనా ఓటరును జాబితా నుంచి తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి నోటీసు ఇచ్చి, తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలని కూనంనేని పేర్కొన్నారు. విచారణ లేకుండా మూకుమ్మడిగా ఓట్లను తొలగించడం అన్యాయమని అన్నారు. రిక్షా కార్మికుడి నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు, సంపన్నుల వరకు ప్రతి ఒక్కరికీ ఒకే ఓటు విలువ ఉంటుందని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేశారు.

జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతించాలి :
దేశ రాజధానిలో ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు కీలక వేదికగా ఉన్న జంతర్‌మంతర్‌లో ఆందోళనలపై ఆంక్షలు విధించడంపై కూనంనేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరికాదన్నారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, నిర్బంధాన్ని ఆశ్రయిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ చొరవ చూపాలని కోరారు.

కరువు పరిస్థితులపై కేంద్రం స్పందించాలి :
తెలంగాణలో కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని కూనంనేని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 315 మండలాలను కరువు మండలాలుగా గుర్తించిన నేపథ్యంలో రైతులకు ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వరి సాగు చేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే వరి వేసిన రైతులకు నీటి సదుపాయం కల్పిస్తుందా? నష్టపరిహారం చెల్లిస్తుందా? అన్నది స్పష్టం చేయాలన్నారు. కరువు సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను పెంచాల్సిన అవసరం ఉందని కూనంనేని పేర్కొన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకంలో నిధుల వాటాను మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరిగిందని, రాష్ట్రం తన వాటా నిధులు సమకూర్చలేకపోవడంతో గ్రామాల్లో పనులు నిలిచిపోతున్నాయని విమర్శించారు.

ఆర్‌టిసి ఎన్నికల్లో ఎర్రజెండా సంఘాల విజయంపై అభినందనలు :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఆర్‌టిసి ఎన్నికల్లో ఎఐటియూసి అనుబంధ సంఘం విజయం సాధించడం కార్మిక వర్గ చైతన్యానికి నిదర్శనమని కూనంనేని అన్నారు. ఆర్టీసీలో ఎంప్లాయీస్‌ యూనియన్‌కు దశాబ్దాల చరిత్ర ఉందని, సింగరేణిలోనూ కార్మికులు ఎర్రజెండా సంఘాలపై విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. విజయం సాధించిన కార్మిక సంఘాల నాయకులకు, కార్మికులకు సిపిఐ తరఫున అభినందనలు తెలిపారు. ఆర్‌టిసి ఎన్నికల ఫలితాలను రాజకీయ కోణంలో చిత్రీకరించడం సరికాదన్నారు. ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయంటూ ఫలితాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. కార్మికుల తీర్పును గౌరవించి, వారి సమస్యల పరిష్కారానికి సంఘాలు కృషి చేయాలని అన్నారు.

సిపిఐ ఎప్పుడు ప్రజల పక్షమే :
రాజకీయపరంగా మాత్రమే కాంగ్రెస్‌తో తమకు అవగాహన ఉందని, అయితే ప్రజా సమస్యలప పట్ల ఎప్పుడే సిపిఐ ప్రజాపక్షమేనని కూనంనేని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ తమను మద్దతు కోరలేదని అయితే సిపిఐ(ఎం), స్వతంత్ర అభ్యర్థులు సైతం తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. ఓట్ల నమోదు తర్వాతే మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని , ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి సారించామని, సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. సిపిఐ, కాంగ్రెస్‌ వేర్వేరు పార్టీలు కావడంతో ప్రతి అంశంపైనా ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందుకే సిపిఐగా ప్రజలకు మేలు చేసే అంశాలపై కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని, ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.

విద్యుత్‌ రంగంపై ఆర్థిక భారం తగ్గించాలి :
విద్యుత్‌ రంగానికి సంబంధించిన అంశాల్లో భారీ ఆర్థిక భారం ప్రజలపై పడకుండా చూడాలని ఆయన అన్నారు. రూ.5,000 కోట్ల అదనపు భారం పడే పరిస్థితి తలెత్తితే సంబంధిత వర్గాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సింగరేణి, విద్యుత్‌ రంగానికి సంబంధించి రూ.56,000 కోట్ల చెల్లింపుల భారం ఉందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలను సమావేశపరిచి, అందరికీ ఆమోదయోగ్యమైన మధ్యేమార్గాన్ని అన్వేషించాలని సూచించినట్లు తెలిపారు.

వరికి రూ.30 వేలు పత్తికి రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలి : పశ్యపద్మ
వర్షభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 315 మండలాలో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రైతులనుఅన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్‌ చేశారు. కరువు నెలకొన్న మండలాలో వరికి ఎకరాకు రూ.30వేలు, పత్తికి రూ.50వేలు కూరగాయాలు , ఇతర పంటలకు రూ.20 వేల చోప్పున నష్ట పరిహారం అందించి రైతులనుఆదుకోవాలని కోరారు. కరువు నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అఖిల పక్ష సమావేశం తక్షణమే ఏర్పాటు చేసి రైతులను ప్రజలను ఆదుకోవడానికి యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విఎస్‌.బోస్‌ మాట్లాడుతూ… ఎంప్లాయీస్‌ యూనియన్‌పై కార్మికులు విశ్వాసంతో విజయం అందించారని, ఆ తీర్పును గౌరవించాలని అన్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మానుకుని, కార్మికుల సర్వీసు నిబంధనలు, వేతనాలు, ఇతర ప్రయోజనాలకు నష్టం కలగకుండా ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం, యూనియన్‌ సమన్వయంతో విలీన ప్రక్రియ పూర్తయితే 2026 సంవత్సరం ఆర్టీసీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అన్నారు.

ఆర్‌టిసి ఎన్నికల ఫలితాలపై తప్పుడు ప్రచారం ఆపండి : ఎస్‌.బాబు
ఆర్‌టిసి ఎన్నికల్లో కార్మికుల తీర్పును వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాబు హెచ్చరించారు. మొత్తం 34,174 ఓట్లు పోలవగా, తమ ఐక్య కూటమికి 18,223 ఓట్లు వచ్చాయని, తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌కు 13,826 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. అధికారిక ఫలితాల పత్రం ఆధారంగానే మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఈ నెల 17న పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత లేబర్‌ కమిషనర్‌ నుంచి అధికారిక పత్రం తీసుకుని ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అప్పటివరకు ఎన్నికల ఫలితాలపై తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. తమ విజయానికి రాజకీయ పార్టీల మద్దతు, డబ్బు పంపిణీ కారణం కాదని, కార్మికుల విశ్వాసమే గెలిపించిందని బాబు స్పష్టం చేశారు. సిపిఐ, ఎఐటియుసి తమకు అండగా నిలిచాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page