పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై ( ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ ) జాతీయ వర్క్షాపులో నిపుణుల పిలుపు
తార్నాక, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) : పర్యావరణ సుస్థిరత, పర్యావరణ వ్యవస్థల పునరుద్దరణకు చెరువుల జీవనోధ్ధరణకు శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం అని పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు, అధికారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిఎస్ఐర్-నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( నీరి ) హైదరాబాద్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఐఐసిటీలోని పీఎం.భార్గవ ఆడిటోరియంలో ‘ ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ ‘ అనే అంశంపై జాతీయ వర్కుషాప్ జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన స్ట్రాటజిక్ అడ్వయిజర్, డైరెక్టర్ ది. హిమాలయ ఇనిషియేటివ్, పద్మశ్రీ డాక్టర్ ఏకలవ్య శర్మ మాట్లాడుతూ… జీవవైవిద్య సంరక్షణకు అత్యుత్తమ శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం అన్నారు. పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు దక్కాలంటే స్థానిక ప్రజలకు పూర్తి భాగస్వామ్యం కల్పించాలన్నారు. విస్తృత సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు హిమాలయాల సంరక్షణకు తీసుకున్న అనుభవాలను వివరించారు. పర్యావరణ రక్షణకు పరిశ్రమలు, సైన్స్ ఆండ్ టెక్నాలజీ సంస్థలు, విధాన కర్తలు సమన్వయంతో పని చేయాలనీ అన్నారు. పర్యావరణ విఘాతంతో ఇటీవల నేపాల్లో సంభవించిన వరదలకు గల కారణాలను ఉదహరించారు.

చెరువుల జీవనోధ్ధరణకు హైడ్రా చర్యలు :
విశిష్ట అతిధిగా హాజరైన హైడ్రా కమీషనర్ రంగనాథ్ మాట్లాడుతూ… నగరంలో చెరువుల పునరుద్దరణకు హైడ్రా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. చెరువుల పరిరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. దెబ్బతిన్న చెరువులను తిరిగి పర్యావరణ ప్రాముఖ్యతను కలిగిన ప్రాంతాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో అన్యాక్రాంతమైన బతుకమ్మ కుంట, నల్ల చెరువు వంటి పలు చెరువులను పునరుద్దరించిన పద్దతులను సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్.శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎన్.శాస్త్రీ, సీఎస్ఐఆర్-నీరి డైరెక్టర్ డాక్టర్.ఎస్.వెంకట మోహన్, నీరి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం చైర్ డాక్టర్.షేక్ భాషా, దాదాపు 200 మంది ప్రతినిధులు పాల్గొని పర్యావరణ పరిరక్షణపై సమగ్రంగా చర్చించారు. ఈ సదస్సు ద్వారా ఎకోసిస్టమ్ రెస్టోరేషన్కు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి రిపోర్టును సమర్పిస్తామని వర్కుషాప్ నిర్వాహకులు పేర్కొన్నారు.
