హైదరాబాద్ పోలీసుల్లో మహిళా అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ – న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్

హైదరాబాద్ పోలీసుల్లో మహిళా అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ

– న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్


హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 05, అద్దం న్యూస్ :    హైదరాబాద్ పోలీసుల్లో మహిళా అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ జ‌రుగుతుంద‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ అన్నారు. హైదరాబాద్ నగర పోలీసులు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ శుక్ర‌వారం మహిళా హార్స్ రైడర్స్‌ను ప్రవేశపెట్టారు. పది మంది సాయుధ రిజర్వ్ ( AR ) మహిళా కానిస్టేబుళ్లు రెండు నెలల పాటు గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో శిక్షణ పొంది, ఇప్పుడు గుర్రపు పోలీసు దళంలో భాగమయ్యారు. దేశంలోనే ఇదొక కీలకమైన నిర్ణయం అని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ తెలిపారు. ఈ మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు, విఐపిల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగించనున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, మహిళా మౌంటెడ్ పోలీసులు గస్తీలో మొదటి సారిగా పాల్గొనబోతున్నారని సివి.ఆనంద్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర పోలీసులు తమ డాగ్ స్క్వాడ్‌ను కూడా విస్తరిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న 34 శునకాలతో అధిక పనిభారం ఉన్నందున, ఆ సంఖ్యను 54 కు పెంచాలని నిర్ణయించుకున్నామ‌న్నారు. అదనపు శునకాలను ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ( IITA ) లో విస్తృత శిక్షణ పొందిన తర్వాత బృందంలో చేర్చుకుంటామన్నారు. బాంబులు, మాదక ద్రవ్యాలు, నేరస్తుల గుర్తింపు వంటి వాటిలో వీటిని వినియోగిస్తామని తెలిపారు. శునకాల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్ల నుండి నాణ్యమైన శునకాలను ఎంపిక చేస్తోంద‌న్నారు. మొదటి దశలో 12 శునకాలను సేకరించారని, భవిష్యత్తులో మరికొన్నిటిని తీసుకుంటామని తెలిపారు. నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ( OGH ) నిర్మాణానికి సంబంధించిన ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, గోషామహల్ పోలీస్ స్టేడియం ఆవరణలోని గుర్రపు మైదానం, అశ్విశాల వంటి వాటిని కొత్త ప్రదేశానికి మార్చుతున్నారన్నారు. ఈ కొత్త మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింద‌ని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కోసం కొత్త భవనాలు, స్వాధీనం చేసుకున్న వాహనాల నిలుపుదల ప్రదేశాలు, కొత్త గుర్రపు శాలలు, పెరేడ్ గ్రౌండ్ వంటివి ఉంటాయని తెలిపారు. 11.5 ఎకరాల విస్తీర్ణంలో 60 శునకాల కోసం డాగ్ కెనాల్స్, మౌంటెడ్ యూనిట్‌ను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు సెప్టెంబర్ 8 న పూర్తవుతాయని కమిషనర్ తెలిపారు.


గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి :

నేడు ( శ‌నివారం ) జ‌రుగ‌నున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ తెలిపారు. సుమారు 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుందని, ట్యాంక్ బండ్ వద్ద మాత్రమే 50 వేల విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 29 వేల మంది పోలీసులు షిఫ్టులలో విధులు నిర్వర్తిస్తారని, నిమజ్జన మార్గాలను పర్యవేక్షించడానికి సిసి కెమెరాలతో పాటుగా అదనంగా 250 సిసి కెమెరాలు, 6 డ్రోన్‌లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరాల్లో డీజేల కారణంగా చాలా మంది యువకులు మరణించారని, వారి ఆరోగ్యం దెబ్బతింటుందని కమిషనర్ ఆనంద్‌ పేర్కొన్నారు. అందుకే ఈ సంవత్సరం డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తిలో మతం కాకుండా ప్రజల ఆరోగ్యం ప్రధానమని, ఈ విషయంలో భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా పోలీసులకు సహకరిస్తోందని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో కార్ హెడ్ క్వార్టర్స్ డిసిపి రక్షిత కృష్ణ మూర్తి, సౌత్ వెస్ట్ జోన్ డిసిపి జి.చంద్ర మోహన్, సైబర్ క్రైమ్ డిసిపి ధార క‌విత‌, సిఎస్‌డ‌బ్ల్యు డిసిపి పి.గిరి రాజు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page