...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
– పాత్రికేయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
♦ మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 17, ( అద్దం న్యూస్ ) :      జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేయడం సరికాదని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు మంత్రిని కోరారు. అదేవిధంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ( ఐపీ ) ఆధారిత న్యూస్ ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ ఛానళ్లకు జిల్లాస్థాయిలో నాలుగు, రాష్ట్రస్థాయిలో 12 అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. చిన్న, మధ్యతరహా పత్రికలకు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల బిల్లులను వెంటనే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. చిన్న, మధ్యతరహా పత్రికలను ప్రభుత్వ ప్రకటనల ఎంపానెల్‌మెంట్‌లో చేర్చి వాటి మనుగడకు సహకరించాలని కోరారు. సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జర్నలిస్టులందరికీ ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్ట్ మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి రూ.10 లక్షల భీమా పరిహారం అందించే విధంగా పథకాన్ని అమలు చేయాలని కోరారు.

జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు :
 అక్రెడిటేషన్ కార్డులు మంజూరవుతున్నప్పటికీ జర్నలిస్టులకు హెల్త్ కార్డుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫెడరేషన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు :
 సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఈ పథకంలో పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గుర్తించి వారికి ప్రత్యేకంగా సహాయం, సంక్షేమ చర్యలు అందించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, కో–కన్వీనర్లు ఆర్.శ్రీనివాస్, ఎస్.రవికుమార్ తదితరులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.