Sunday, October 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADఉత్కంఠభరితంగా సాగిన హౌస్ ఫెడ్ ఎన్నికలు

ఉత్కంఠభరితంగా సాగిన హౌస్ ఫెడ్ ఎన్నికలు

📰 Generate e-Paper Clip

ఉత్కంఠభరితంగా సాగిన హౌస్ ఫెడ్ ఎన్నికలు
– డైరెక్టర్లుగా ముదుగంటి శ్రీనివాస్‌ రెడ్డి, బ్రహ్మాండభేరి గోపరాజు సహా ఏడుగురు విజయం

హైద‌రాబాద్‌, అక్టోబర్ 3, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ( టిఎస్ హౌస్ ఫెడ్ ) ఎన్నికలు హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని కార్యాల‌యంలో శ‌నివారం ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడ్డారు. మొత్తం 86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ముదుగంటి శ్రీనివాస్‌ రెడ్డి, బ్రహ్మాండభేరి గోపరాజు, పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినీడి ప్రసాద్, కిషన్ రావు, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి డైరెక్టర్లుగా విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో విజేతల అనుచరులు, మద్దతుదారుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రక్రియను సొసైటీల ప్రతినిధులు, ఓటర్లు ఆసక్తిగా పరిశీలించారు. డైరెక్టర్లుగా ఎన్నికైన వారికి ఎన్నికల అధికారి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు పలువురు సొసైటీల ప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపారు. కాగా, హౌస్ ఫెడ్‌కు కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. దీంతో తదుపరి దశలో ఫెడరేషన్ నాయకత్వంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలకు సంబంధించిన పలు అంశాల్లో హౌస్ ఫెడ్‌ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లపై బాధ్యతలు కూడా పెరిగాయి. హౌసింగ్ సొసైటీల అభివృద్ధి, సభ్యుల ప్రయోజనాలు, హౌసింగ్ సంబంధిత అంశాలపై ఫెడరేషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు.

ఈ సంద‌ర్భంగా ముదుగంటి శ్రీనివాస్‌ రెడ్డి, బ్రహ్మాండభేరి గోపరాజు లు మాట్లాడుతూ… త‌మ ప్యాన‌ల్ నుంచి న‌లుగురం గెలిచామ‌న్నారు. ఫెడరేషన్‌ను ప్రక్షాళన చేసి హౌసింగ్‌ సొసైటీలను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో శివశాయి నాయకత్వంలో తమ ప్యానల్‌ ముందుకు సాగుతుందని తెలిపారు. ఫెడరేషన్‌లో కొత్త తరం నాయకత్వం రావడం ఫెడరేషన్‌తో పాటు హౌసింగ్‌ సొసైటీలకు శుభసూచకమన్నారు. రాబోయే రోజుల్లో కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తామని, ఫెడరేషన్‌ సొసైటీలకు అండగా నిలిచి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేస్తామని చెప్పారు. తమ ప్యానల్‌కు మద్దతుగా ఓటు వేసిన ప్రతి హౌసింగ్‌ సొసైటీల‌ అధ్యక్షుడు, ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ సభ్యులు, అధ్యక్షులు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా తాను, తమ ప్యానల్‌ డైరెక్టర్లు అందుబాటులో ఉంటామని, శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి, ఎన్నికల ప్రక్రియకు సహకరించిన సొసైటీల అధ్యక్షులకు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు, నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. అలాగే త‌మ‌కు ప‌రోక్షంగా స‌హ‌కరించిన మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీధ‌ర్ బాబు, కొమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, డిసిసి అధ్య‌క్షులకు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాధాలు తెలియ‌చేశారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page