Friday, September 18, 2026
HomeHyderabadప్రకృతి వైవిధ్యాన్ని, వైద్యాన్ని అభివృద్ధి చేసుకుందాం. అడవులను, ఆదివాసులను కాపాడుకుందాం – ప్రకృతి - ఆరోగ్య...

ప్రకృతి వైవిధ్యాన్ని, వైద్యాన్ని అభివృద్ధి చేసుకుందాం. అడవులను, ఆదివాసులను కాపాడుకుందాం – ప్రకృతి – ఆరోగ్య రాష్ట్ర మహాసభలో ప్రకృతికవి జయరాజు పిలుపు

ఉస్మానియా యూనివ‌ర్శిటి, మే 25, అద్దం న్యూస్ :  అడవిని అంటిపెట్టుకుని, అడవిని పరిరక్షిస్తున్న ప్రకృతి ప్రేమికులైన ఆదివాసుల హననం దారుణమ‌ని, ప్రాచీన కాలం నుండి వారసత్వంగా వస్తున్న ప్రకృతి వైవిధ్యాన్ని, వైద్యాన్ని అభివృద్ధి చేసుకుందాం. అడవులను, ఆదివాసులను కాపాడుకుందామ‌ని ప్రకృతి – ఆరోగ్య రాష్ట్ర మహాసభలో ప్రకృతికవి జయరాజు పిలుపునిచ్చారు. 40 రోజులుగా ఆహార దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం హైద‌రాబాద్ ఉస్మానియా యూనివ‌ర్శిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలోని ఈసీఈ ఆడిటోరియంలో ప్రకృతి ఆరోగ్య మహాసభను నిర్వహించారు. సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు, ప్రకృతి వైద్యులు టి.వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకృతికవి జయరాజు మాట్లాడుతూ… సహజసిద్ధమైన, స్థిరమైన ఆరోగ్యానికి ప్రకృతి ఔషధాలు ముఖ్యమైనవి. ఆ ఔషధాలను అందించే అడవి అత్యంత ముఖ్యమైనదన్నారు. ఆ అడవులను, ఆదివాసులను కాపాడుకోవాల్సిన పరిస్థితులలో ఈ ప్రకృతి ఆరోగ్య రాష్ట్ర మహాసభ జరపడం ప్రత్యేకమైన అంశమని వివరించారు. ఆకలి సమస్య పరిష్కారానికి వచ్చిన హరిత విప్లవం నేడు ప్రాణగండంగా మారిందన్నారు. ఆహారంలోకి పరోక్షంగా పంపబడిన విషం సమాజాన్ని అనారోగ్యపాలు చేసిందని వివ‌రించారు. ఈ అనారోగ్య సమస్యను సొమ్ము చేసుకుంటూ మెడికల్ మాఫియా విలయతాండవం చేస్తుందని విమ‌ర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతిని పరిరక్షించే ఉద్యమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సామాజిక మనుగడకు ప్రధాన ఆధారమైన ప్రకృతి వనరులను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యంగా ఉంటేనే మనం, మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. రసాయనిక ఎరువులను వినియోగించడం వల్ల భూమి సారవంతమైన జీవాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం లభించడం లేదన్నారు. ఈ ఈ పరిస్థితులు భవిష్యత్తు తరానికి మరింత ప్రమాదకరంగా తయారు కాబోతున్నాయని అన్నారు.అడవులన్నీ పెట్టుబడిదారులకు దారాద‌త్తం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితం ప్రకృతి వెలిగించిన ప్రాణం లాంటిదని పేర్కొన్నారు.

జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ… ప్రకృతి జీవన విధానం ప్రకృతి వైద్యం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త, అడవి సృష్టికర్త జడ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. అడవులకు మనసే ప్రమాదకరంగా మారుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదర్శ రైతు లావణ్య రెడ్డి మాట్లాడుతూ.. మనిషి ప్రస్తుత ఆధునిక కాలంలో వినియోగిస్తున్న పద్ధతుల ద్వారా ప్రతి రోజు 25 గ్రాముల కెమికల్ ను తన శరీరంలోకి పంపుతున్నాడని వివరించారు. వ్యవసాయాన్ని రసాయనిక విలువలు ద్వారా నిర్వహించడం వలన భూమిలోని సూక్ష్మజీవులు నశిస్తున్నాయని తెలియజేశారు. భూమి ఆరోగ్యంగా ఉండాలని, భూమిలో పండే పంట ఆరోగ్యంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తాను 30 రకాల పంటలను పండిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ హిప్నాటిస్టు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ… మనం ప్రతిరోజు అనేక విధాలుగా ప్రకృతిని నాశనం చేస్తున్నప్పటికీ ప్రకృతి మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ పిసివి స్వామి, డాక్టర్ సుగుణ రావు, డాక్టర్ ఎల్ వెంకన్న, డాక్టర్ ఆరూర్ సుధాకర్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణవేత్త పద్మా రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ దుబ్బ రంజిత్, ఉద్యమకారులు జాల లింగయ్య, ప్రజా కవి కళాకారుడు అర్జున్ రావు, జన సమితి నేత నరసయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page