ఈ నెల 9న జ‌రుగ‌నున్న తెలంగాణ విద్యార్థి విజయ దివస్‌ను విజయవంతం చేయండి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపు

ఈ నెల 9న జ‌రుగ‌నున్న తెలంగాణ విద్యార్థి విజయ దివస్‌ను విజయవంతం చేయండి
– తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ :   యూపిఎ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభం చేస్తున్నట్లు 2009 డిసెంబ‌ర్ 9 న అప్ప‌టి కేంద్ర హోంమంత్రి చిదంబ‌రం ప్ర‌క‌టించిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ నెల 9న జ‌రుగ‌నున్న తెలంగాణ విద్యార్థి విజయ దివస్‌ను విజయవంతం చేయాల‌ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపునిచ్చింది. శ‌నివారం ఉస్మానియా యూనివ‌ర్శిటి ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద తెలంగాణ విద్యార్థి విజయ దివాస్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఉద్యమకారుల జేఏసీ నాయకులు నండ్రు నరసింహ, నెహ్రూ నాయక్, కంచర్ల బద్రి, రవీందర్ నాయక్, చాగంటి రాములు, పూప్పల మల్లేష్, జాజుల లింగం గౌడ్, పొన్నం ముత్యం గౌడ్, సురేష్ దూడపాక, జనగామ సంతోష్, సిద్ధార్థ, నోముల వంశీ, దర్శనం జాను, కృష్ణ లత, రంజిత్ పుట్ట, చీరాల వంశీ తదితరులు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ, కేసీఆర్ కరీంనగర్‌లో తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఖమ్మంకు తరలించిన క్రమంలో కేసీఆర్ నిరాహార దీక్షను మధ్యలోనే విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ఉస్మానియా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎన్‌సిసి వరకు ర్యాలీని ప్రారంభించి, కేసీఆర్ శవయాత్ర చేశారని తెలిపారు.

ర్యాలీగా వెళుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠి చార్జి చేయడం భాష్ప వాయుగోలాలను ప్రయోగించడంతో ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని పేర్కొన్నారు. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంత్ చారి ఆత్మహుతికి పూనుకున్నాడని, ఎన్‌సిసి గేటు వద్ద సిరిపురం యాదయ్య లాంటి ఎంతో మంది విద్యార్థి ఉద్యమకారులు తమ బలిదానాలతో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారని పేర్కొన్నారు. అలాంటి ఉద్యమాన్ని కేవలం ఒక వ్యక్తి చేసిన స‌గం దినానికి దీక్షకు కుదించి, అది కూడా నిమ్మరసం తాగిన కెసిఆర్ దీక్ష‌ను విరమించార‌న్నారు. అటువంటి వ్యక్తిని ఆకాశానికి ఎత్తుతూ అటు తెలంగాణ ప్రజలు, ఇటు తెలంగాణ విద్యార్థి లోకం, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, యావత్ తెలంగాణలోని సబ్బండ కులాలు, సకల జనులు కలిసి సాధించిన తెలంగాణను వ్యక్తికి ఆపాదించి దీక్ష దివాస్ పేరిట ఉత్సవాలను నిర్వహించడం హాస్యాస్పదం అని అన్నారు. చరిత్రలో విద్యార్థుల త్యాగాలకు స్థానం లేకుండా కుట్ర పన్నుతున్నారన్నారు. అందుకే ఏదైతే తెలంగాణ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల బలిదానాలను చూసి చెల్లించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల బలిదానాలు చేసుకోవద్దంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమై 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అందుకే ఈ నెల 9 న విద్యార్థి విజయ దివస్ ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page