Thursday, September 24, 2026
No menu items!
HomeGREATER HYDERABADఇంటి ముంగిటకే ‘ మీ సేవా ’ సేవలు – తొలి దశలో ‘ క్యూర్...

ఇంటి ముంగిటకే ‘ మీ సేవా ’ సేవలు – తొలి దశలో ‘ క్యూర్ ’ ప్రాంతాల్లో అమలు

📰 Generate e-Paper Clip

‘ డిజిటల్ గవర్నెన్స్ ’ లో రోల్ మోడల్ గా తెలంగాణ
– ఇంటి ముంగిటకే ‘ మీ సేవా ’ సేవలు
– తొలి దశలో ‘ క్యూర్ ’ ప్రాంతాల్లో అమలు
» ‘ మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్ ’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :   ‘ గుడ్ గవర్నెన్స్ ’ కు టెక్నాలజీని జోడించి ‘ డిజిటల్ గవర్నెన్స్ ’ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పౌర సేవల్ని నేరుగా ఇంటి ముంగిటకే చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బుధవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ‘ మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్ ’ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలనలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అడ్మినిస్ట్రేషన్ కు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

ప్రభుత్వం, యంత్రాంగమే నేరుగా ప్రజల దగ్గరికే వెళ్లేలా ఈ ‘ డోర్ డెలివరీ సర్వీసెస్ ’ కు శ్రీకారం చుట్టామన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే… జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర మీ సేవా సేవలను ఇంటి దగ్గరే అందిస్తామన్నారు. తొలిదశలో ‘ క్యూర్ ’ ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, మీ సేవ వీఎల్ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. పౌరులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని… ఇంటి నుంచే పౌర సేవల్ని పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీఈ అండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, మీ సేవా కమిషనర్ రవి కిరణ్, టీజీటీఎస్ ఎండీ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page