
50 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడలేదు
కలెక్టరేట్లలో పెట్టేవి తెలంగాణ తల్లి విగ్రహాలు కాదు.. కాంగ్రెస్ తల్లి విగ్రహాలు
ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రవాణాను స్తంభింపజేసేలా రైల్ రోకో
♦ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ బ్యూరో, జూన్ 24, అద్దం న్యూస్ : బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతునివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అడిక్‌మెట్‌లోని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వర రావు, జేవీ చలపతి రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. గోవర్ధన్ తో మంగళవారం ఎమ్మెల్సీ కవిత వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సి కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్ కు పంపిస్తామన్నారు. అధికారంలో ఉన్నామని ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో కాంగ్రెస్ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తుందని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను గౌరవ మర్యాదలతో గాంధీ భవన్ కు పంపిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేయడం సరికాదని.. అది కాంగ్రెస్ తల్లి అని తాము మొదటి నుంచి చెప్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం మార్చుతోన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజామోదం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏడాదిగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్వహించామన్నారు. తమతో పాటు బీసీ సంఘాలు చేసిన ఆందోళనలకు దిగివచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపజేసిందన్నారు. ఈ బిల్లును కేంద్రానికి పంపి మూడు నెలలవుతున్నా అమలు చేయడానికి కేంద్రం పై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయడం లేదన్నారు. ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేయడంలో హాఫ్ సెంచరీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో ఒక్కసారి కూడా బీసీ బిల్లుల ఆమోదం కోసం ఒత్తిడి తేలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం బీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటే ఉద్యమబాట ఒక్కటే మార్గమన్నారు. అందుకే రైల్ రోకోకు పిలుపునిచ్చామని తెలిపారు. తమతో కలిసి వచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి రైల్ రోకో నిర్వహిస్తామన్నారు. బీసీ బిల్లు ఆమోదానికి ఎంత ఆలస్యమైతే బీసీలకు అంత అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని.. ఈ ఆందోళనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, సీపీఎం, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి :
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపైనే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి అన్నారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తోన్న ఉద్యమాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయమైన డిమాండ్ అన్నారు. సామాజిక న్యాయం కోసం కవిత చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రిజర్వేషన్లను పెంచి అసమానతలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. బీజేపీ ఎప్పటికీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగానే ఉంటుందన్నారు. మొన్నటి వరకు కులగణనను కూడా బీజేపీ వ్యతిరేకించిందని, ప్రజా ఉద్యమాలకు తలొగ్గి కులగణన చేయడానికి ముందుకొచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులపై ఉందన్నారు. కేంద్రానికి వినతిపత్రాలు ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కావొద్దని.. అన్నిపార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply