రైతులకు కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతున్నది
నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి రేవంత్‌రెడ్డి !
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వనపర్తి, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) : రైతులకు కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి అని ధ్వజమెత్తారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో రైతులతో కలిసి కెటిఆర్ ర్యాలీని నిర్వహించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని సబ్‌స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గుమ్మడం, పెబ్బేరు సబ్‌స్టేషన్లకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… ఐదారు గంటలు కూడా కరెంట్ సరిగా రావడం లేదని రైతులు చెబుతున్నారని… అధికారులు మాత్రం 12 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారు… కానీ ఒక్కో రోజు 10–12 సార్లు కరెంట్ పోతున్నదన్నారు.
రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని… పాత రోజులు తెస్తానని చెప్పి.. మళ్లీ అవే రోజులను తీసుకొచ్చిండని ఎద్దేవా చేశారు. స్టార్టర్లు, మోటార్లు కాలిపోవడం.. విద్యుత్ కోతలు.. ఇలా అన్ని పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయని, జూరాల ఆయకట్టు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 248 టీఎంసీల నీళ్లు కృష్ణా నదికి వచ్చాయి. కానీ పాలమూరు బిడ్డే పాలమూరు రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడని విమర్శించారు. ఏపీ కృష్ణా నీళ్లను దోచుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. జూరాల కింద మొత్తం 18 టీఎంసీల నీళ్లే ఇచ్చారని, కల్వకుర్తి పంపులు ఆన్ చేయడం లేదని.. మూడు పంపులను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారన్నారు. కల్వకుర్తి కింద 10 టీఎంసీలకు మించి నీళ్లు ఇవ్వలేదని, జూరాల కింద ఉన్న లక్షా పది వేల ఎకరాల ఆయకట్టులో ఒక్క ఎకరం ఎండినా వదిలిపెట్టమని కెటిఆర్ స్పష్టం చేశారు.
రైతుల కోసం ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదన్నారు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని… రైతుబీమా ప్రీమియం కూడా కట్టకుండా రైతులను ఆగం చేశారని ధ్వజమెత్తారు. “ మోసపోతే గోస పడతాం ” అని కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని కెటిఆర్ గుర్తు చేశారు. సీఎం సొంత జిల్లాలోనే రైతులు కరెంట్ రావడం లేదని రోడ్డెక్కుతున్నారని, రైతులకు కరెంట్ ఇచ్చే తెలివి లేక సీఎం వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తి చేశాం… కానీ సీఎంకు ఇష్టం లేక.. కేసీఆర్ కు పేరు వస్తుందనే భయంతో పనులు ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. పాలమూరు రైతులను సీఎం తొక్కుతున్నాడని, పెబ్బేరులో వెయ్యి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారన్నారు. శ్రీశైలం నుంచి సీఎం గురువు చంద్రబాబు యథేచ్ఛగా నీళ్లు తీసుకెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటకతో మాట్లాడి రైతుల కోసం నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు ప్రయోజనాలే బీఆర్ఎస్‌కు ముఖ్యమని.. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.

