తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం దాటుతున్న తెలంగాణకు జరిగిందేమీ లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 2, అద్దం న్యూస్ :   వందల మంది విద్యార్థుల బలిదానాల‌తో, ఆత్మార్పణతో తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం దాటుతున్న తెలంగాణకు జరిగిందేమీ లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. పేదవాడికి ఒరిగిందేమీ లేదని… లబ్ది చేకూరింది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే అని అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… నీళ్లు – నిధులు – నియామకాలు అంటూ ప్రచారం చేసుకొని తెలంగాణ మేమే తెచ్చామని గత పదిహేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కేవలం దోపిడీలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అమ‌లు కాని హామీలతో మేమే తెలంగాణ ఇచ్చామంటూ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏడాదిపైగా కాలం గడుస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమ‌ర్శించారు. నాటి అమరుల త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిందని ధ్వ‌జ‌మెత్తారు. జీతాలు రాక స్కాలర్‌షిప్‌లు లేక పేద బలహీన వర్గాల విద్యార్థులు అలమటిస్తుంటే, ఖజానా ఖాళీ అంటూ ఊదరగొడుతూ ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందాల పోటీలు అంటూ, 40 సార్లకు పైగా హస్తినకు ప్రయాణాలు మినహా వీరు సాధించిందేమీ లేదన్నారు. సన్న బియ్యం అంటూ సాకులు చెప్పుకుంటూ, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, అదిగో రేషన్ కార్డులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇటీవలే ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకం మళ్లీ వాయిదా వేశారు. ఇవన్నీ చూస్తుంటే “ఏరు దాటాక తెప్ప తగలేసే” వైనాన్ని గుర్తు చేస్తోందని తెలిపారు. గత బిఆర్ఎస్ పార్టీ హయాంలో అధికార దుర్వినియోగం, అవినీతి, దోపిడి కేవలం ఒక కుటుంబానికే పరిమితమైతే, ఇప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి, దోపిడి వికేంద్రీకరణ జరిగి కాంగ్రెస్ నాయకులందరికి పాకిందన్నారు. ఎప్పటికైనా తెలంగాణ హక్కుల కోసం పోరాడేది ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ అని సాయిబాబా అన్నారు. ఈనాటికీ తెలంగాణ అభివృద్ధిలో గానీ, పురోగతిలో గాని, ప్రజల సంక్షేమంలో గాని ఆదర్శంగా నిలబడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page