ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి
– తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూన్ 21, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా ఆర్టీసీలో కార్మిక సంఘంగా బహుజన వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న బహుజన వర్కర్స్ యూనియన్‌ను ప్రకటించారు. బహుజన వర్కర్స్ యూనియన్ కమిటీని ప్రకటించారు. యూనియన్ చైర్మన్‌గా సంపత్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, అధ్యక్షుడిగా సాజిద్, వర్కింగ్ ప్రసిడెంట్‌గా శ్రీనివాస్, డిప్యూటి జనరల్ సెక్రటరిగా కెబి.చారి, కోశాధికారిగా దుర్గేష్, అదనపు జనరల్ సెక్రటరిగా రవి కిరణ్, రాష్ట్ర కార్యదర్శులుగా రాంచందర్, నాగేశ్వర్, జాయింట్ సెక్రటరిగా జి.కుమార్, కార్యదర్శులుగా రమేష్, పి.సురేష్, మహిళా విభాగం నాయకులుగా గౌతమి, యాదవ్వ, పార్వతమ్మలను ప్రకటించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ఆర్టీసి కార్మికులకు విలీనం సాధించలేమా అని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఆశయాల మేరకు ఆర్టీసీలో బహుజన వర్కర్స్ యూనియన్‌ను ఏర్పాటు చేశామన్నారు. 2023 ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీలో భూములను ధారదత్తం చేసేందుకు క్యాబినెట్‌లో తీర్మానం చేసినవేమో వెంటనే అమలు అవుతాయి కానీ, మూడేళ్ల క్రితం క్యాబినెట్‌లో తీర్మానం చేసిన ఆర్టీసీ విలీనం మాత్రం అతిగతీలేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే సాని ఆర్టీసీని విలీనం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులను కెసిఆర్ హయాంలో 400, 500 మందిని డిస్మిస్ చేశారని, 270 మందిని ఉద్యోగంలో పెట్టించానన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రెండేళ్లు ఉంటావా ? చేయకపోతే ఈ రెండేళ్లే చివరి అని అన్నారు. ఊపర్ షేర్‌వాని… అందర్ పరేషాని అన్న చందంగా ఆర్టీసిని చేశారని, అందుకు కారణం ఈ సంఘాలే అని విమర్శించారు. విలీనం కావాలంటే బహుజన్ వర్కర్స్ యూనియన్ తోనే సాధ్యం అవుతుందని, ఎన్నికలు కావాలంటే… దళారి వ్యవస్థే కావాలంటే మిగిలిన సంఘాలతో అవుతుందన్నారు. ఆర్టీసి కార్మికులు కూడా దళారిగా ఉండే సంఘాల వైపు ఉంటారా ? లేదా ఆర్టీసి విలీనం కోసం పాటుపడుతున్న బహుజన వర్కర్స్ యూనియన్ వైపు ఉంటారా తేల్చుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారమే బహుజన వర్కర్స్ యూనియన్ ఎజెండా అని స్పష్టం చేశారు. కార్మికుల రక్తాన్ని, కష్టాన్ని వ్యాపారం చేసి వారికి దక్కాల్సిన హక్కులు దక్కకుండా నాటకాలు ఆడారన్నారు. జూలై 5న జరుగనున్న రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.![]()

![]()












Leave a Reply